Begin typing your search above and press return to search.

హరీశ్ విమర్శిస్తే చాలు..దిమ్మ తిరిగే కౌంటర్ షాక్

నిత్యం ఏదో ఒక విషయాన్ని తెర మీదకు తీసుకురావటం.. ప్రభుత్వం మీద విమర్శల వర్షం కురిపించటం ఒక అలవాటుగా మార్చుకున్నారు.

By:  Tupaki Desk   |   25 March 2024 12:30 AM GMT
హరీశ్ విమర్శిస్తే చాలు..దిమ్మ తిరిగే కౌంటర్ షాక్
X

కొన్ని సందర్భాల్లో నిత్యం ఏదో ఒకటి మాట్లాడేకంటే మౌనంగా ఉండటం మంచిదన్న మాట వినిపిస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని బీఆర్ఎస్ ముఖ్యనేతలు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదన్న మాట వినిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు విమర్శను లేశమాత్రంగా కూడా స్వీకరించేందుకు సిద్ధంగా లేని గులాబీ నేతలు.. విపక్షంలో ఉన్న వేళలోనూ అదే తీరును ప్రదర్శిస్తున్నారు. నిత్యం ఏదో ఒక విషయాన్ని తెర మీదకు తీసుకురావటం.. ప్రభుత్వం మీద విమర్శల వర్షం కురిపించటం ఒక అలవాటుగా మార్చుకున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ మీద తాము సంధిస్తున్న విమర్శలకు ప్రతి విమర్శలు.. కౌంటర్ షాకులు భారీగా వస్తున్నాయన్న విషయాన్ని వారు గుర్తించటం లేదు. ఈ రోజున వారు ఏమని డిమాండ్ చేస్తున్నారో? వాటిని తమ పదేళ్ల పాలనలో చేశారా? అన్న ప్రశ్నకు సమాధానం లభించని పరిస్థితి. అన్నింటికి మించి రేవంత్ సర్కారు కొలువు తీరి కేవలం వంద రోజులు మాత్రమే అయ్యిందన్న విషయాన్ని హరీశ్ రావు లాంటి సీనియర్ నేతలు గుర్తిస్తే మంచిదని హితవు పలుకుతున్నారు. నిత్యం నీతులు వల్లిస్తున్న హరీశ్ లాంటివాళ్లు పదేళ్ల తమ పాలనలో చేసిన ఘనకార్యాల్ని మర్చిపోతున్నారా? అని ప్రశ్నిస్తున్నారు.

సాధారణంగా ఏ ప్రభుత్వతమైనా కొలువు తీరిన తర్వాత కొంతకాలం సానుకూలత ఉంటుంది. ఆ సమయంలో ఏం మాట్లాడినా రివర్సులో తగులుతుందన్న చిన్నపాటి లాజిక్ ను మిస్ అవుతున్నట్లుగా చెబుతున్నారు. రేవంత్ సర్కారుకు కాస్తంత గడువు ఇచ్చి.. తప్పుల మీద తప్పులు చేసే వరకు వెయిట్ చేసి.. ప్రజల్లో ఒకలాంటి చిరాకు వచ్చిన తర్వాత మాట్లాడటం మొదలు పెడితే.. ప్రజల్లో కూడా స్పందన ఉంటుంది. అందుకు భిన్నంగా రేవంత్ సీఎంగా ప్రమాణం చేసిన నాలుగో రోజు నుంచే ఎదురుదాడి మొదలు పెడితే మైలేజీ కంటే కూడా డ్యామేజ్ ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని హరీశ్ అండ్ కో మర్చిపోతున్నట్లుగా కనిపిస్తోంది.

తాజాగా హరీశ్ మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాటిల్లో హైలెట్ అన్న వాటిని కొన్నింటిని చూస్తే.. ఆయన ప్రతి మాటకు కౌంటర్ విమర్శ ఇట్టే వచ్చేస్తుంది.

‘‘గేట్లు తెరవాల్సింది రాజకీయ పార్టీల కోసం కాదు. రైతు కోసం గేట్లు తెరువు. సీఎం, మంత్రులు హైదరాబాద్‌లో రాజకీయాలు మాని వ్యవసాయ క్షేత్రాలకు వచ్చి రైతులకు ఆత్మవిశ్వాసం కల్పించండి’’

‘‘ముఖ్యమంత్రి మా ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడానికి వాళ్లింటికి వెళ్తున్నాడు. రైతులు చచ్చిపోతుంటే మాత్రం పరామర్శించడానికి వెళ్లడం లేదు. ధైర్యం చెప్పడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు’’

హరీశ్ మాట్లాడిన ఈ రెండు వ్యాఖ్యల్నే తీసుకుంటే.. పార్టీల కోసం గేట్లు తెరవటం కాదు.. వ్యవసాయక్షేత్రాలకు వచ్చి రైతులకు ఆత్మవిశ్వాసాన్ని కల్పించాలన్న హరీశ్ మాటకు.. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ ఏనాడైనా ఆ పని చేశారా? అన్న ప్రశ్న వినిపిస్తోంది. పదేళ్ల కేసీఆర్ పాలనలో వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. దాని గురించి వార్తలు రాసినంతనే వీరంగం వేసిన వైనాన్ని మర్చిపోకూడదు. అలాంటిది ఇప్పుడు మాత్రం వంద రోజుల్లో అద్భుతాలు ప్రదర్శించాలని రేవంత్ సర్కారును కోరటంలో అర్థమేంది? అన్నది ప్రశ్న.

అంతేకాదు.. రైతులు చనిపోతుంటే వారింటికి వెళ్లి పరామర్శించారా? అని ప్రశ్నిస్తున్న హరీశ్ తమ పాలనలోని ఘనకార్యాల్ని మర్చిపోయినట్లున్నారు. తాజాగా జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పల మండలంలో చింతాబాయి తండాలో పర్యటించిన హరీశ్.. అక్కడ కాలువల్లో నీళ్లు రాక బోర్లకు నీళ్లు అందటం లేదని.. పంటలు ఎండిపోతున్నట్లుగా ఆరోపించారు. ఈసారి ఎండలు ఎక్కువగా ఉండటం.. గత వర్షాకాలం సీజన్ లో వర్షాలు సరిగా పడకపోవటంతో భూగర్భ జలాలు తక్కువగా ఉండటం తెలిసిందే. ఇలాంటి వేళలో.. రాష్ట్రంలో కొన్ని సమస్యలు ఉండొచ్చు. ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవటానికి కోడ్ అమల్లో ఉందన్నది మర్చిపోకూడదు. ఇలాంటివేళలో రేవంత్ సర్కారుపై విమర్శలు సంధించటానికే అన్నట్లుగా మాట్లాడటం వల్ల లాభం ఉండదన్న విషయాన్ని హరీశ్ ఎప్పుడు గుర్తిస్తారో?