Begin typing your search above and press return to search.

మైనంపల్లి ఓటమి.. ఇదే హరీష్ రావు టార్గెట్

రాబోయే తెలంగాణ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీలు సాగుతున్నాయి. ముఖ్యంగా హ్యాట్రిక్ కొట్టాలని అధికార బీఆర్ఎస్ చూస్తోంది.

By:  Tupaki Desk   |   3 Nov 2023 4:30 PM GMT
మైనంపల్లి ఓటమి.. ఇదే హరీష్ రావు టార్గెట్
X

రాబోయే తెలంగాణ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీలు సాగుతున్నాయి. ముఖ్యంగా హ్యాట్రిక్ కొట్టాలని అధికార బీఆర్ఎస్ చూస్తోంది. ఈ దిశగా అధినేత కేసీఆర్ తో పాటు అగ్ర నాయకులు కేటీఆర్, హరీష్ రావు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటూ కేసీఆర్ సాగిపోతున్నారు. మరోవైపు ఆయా నియోజకవర్గాలకు వెళ్తూ తమ అభ్యర్థుల విజయం కోసం కేటీఆర్, హరీష్ రావు కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో మల్కాజిగిరి నియోజకవర్గంపై హరీష్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.

మల్కాజిగిరిలో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న మైనంపల్లి హన్మంతరావును ఓడించడమే టార్గెట్ గా హరీష్ రావు సాగుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరపున మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు మర్రి రాజశేఖర్ రెడ్డిని గెలిపించే బాధ్యతను హరీష్ తీసుకున్నారనే చెప్పాలి. తాజాగా మల్కాజిగిరి నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొన్న ఆయన.. మర్రి రాజశేఖర్ రెడ్డిని గెలిపించాలని, నియోజకవర్గ డెవలప్మెంట్ బాధ్యత తనదేనని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మైనంపల్లిని దెబ్బ కొట్టేందుకు హరీష్ రావు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మల్కాజిరిగి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. ఈ సారి కూడా బీఆర్ఎస్ తరపున ఆయన మల్కాజిగిరి టికెట్ దక్కింది. కానీ మెదక్ లో తన తనయుడు రోహిత్ కు టికెట్ ఇవ్వలేదనే కారణంతో పార్టీని వీడి కాంగ్రెస్ కు వెళ్లిన ఆయన రెండు టికెట్లు దక్కించుకున్నారు. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడే హరీష్ రావుపై మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించాలని బీఆర్ఎస్ నేతలు అధినేత కేసీఆర్ కు విన్నవించారు. ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్లి తమపైనే పోటీకి సై అంటున్న మైనంపల్లికి చెక్ పెట్టాలనే లక్ష్యంతో కేసీఆర్ ఉన్నారు. ఈ పనిని హరీష్ రావుకు ఆయన అప్పగించారనే టాక్ ఉంది.