సల్మాన్ ఖాన్ క్షమాపణ కోరితేనే పరిష్కారం!
సల్మాన్ ఖాన్ కి-బిష్ణోయ్ గ్యాంగ్ కి మధ్య అమాయకుడైనా సిద్దిక్ బలైపోవడంతో విషయం జీర్ణించుకోలేనిదిగా మారింది.
By: Tupaki Desk | 15 Oct 2024 9:49 AM GMTబాబా సిద్దిక్ మర్డర్ తో ముంబై అట్టుడికిపోతుంది. సల్మాన్ ఖాన్ కి-బిష్ణోయ్ గ్యాంగ్ కి మధ్య అమాయకుడైనా సిద్దిక్ బలైపోవడంతో విషయం జీర్ణించుకోలేనిదిగా మారింది. బిష్ణోయ్ వర్గానికి సల్మాన్ క్షమాపణలు చెబితే? ఈ సమస్య నుంచి బయట పడే అవకాశం ఉంటుందని ఇప్పటికే బిష్క్షోయ్ వర్గం నుంచి ఓ లేఖ వచ్చింది. కానీ సల్మాన్ ఢీ అంటే ఢీ అనే ముందుకెళ్తున్నారు. ప్రభుత్వం ఆయనకు అన్ని రకాల భద్రత ఏర్పాటు చేసింది.
సల్మాన్ ఖాన్ టచ్ చేయాలంటే? ముందు అతడి ప్రయివేటు సైన్యాన్ని..ప్రభుత్వ భద్రతా దళాల్ని దాటి వెళ్లాలి. బిష్ణోయ్ గ్యాంగ్ లో కసి పట్టుదల చూస్తుంటే? ఆ గ్యాంగ్ సైతం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. దీంతో ఈ వ్యవహారం సల్మాన్ సహా అతడి కుటుంబీకులకు, అభిమానులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా బిజెపి నాయకుడు, రాజ్యసభ మాజీ ఎంపి హరనాథ్ సింగ్ యాదవ్ సల్మాన్ ఖాన్ ని తాను చేసిన తప్పుకు బిష్ణోయ్ వర్గానికి క్షమాపణలు చెప్పాలని సూచించారు.
సంఘం ఇప్పటికీ నటుడిపై ఆగ్రహంతో ఉందని, వారి మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు. దీనికి సంబంధించి ఎ క్స్ లో ఓ పోస్ట్ పెట్టారు. `ప్రియమైన సల్మాన్ ఖాన్, బిష్ణోయ్ కమ్యూనిటీ కృష్ణజింకను పూజిస్తుంది. దానిని మీరు ఆహారంగా తీసుకున్నారు. మీరు జింకని వేటాడి వేటాడి, చంపి, ఉడికించి తిన్నారు. దీని వల్ల బిష్ణోయ్ కమ్యూనిటీ మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
అందుకే ఆ వర్గం అంతగా పగ పెంచుకుంది. ఈ ఘటనకు సంబంధించి క్షమాపణ చెప్పడం అన్నది తెలివైన పని. దీనికే ఇదే పరిష్కారం. ప్రజలు తప్పులు చేస్తారు. మీరు పెద్ద నటుడు, దేశంలోని పెద్ద సంఖ్యలో ప్రజలు మిమ్మల్ని ప్రేమిస్తారు` అని అన్నారు.