Begin typing your search above and press return to search.

త్వరలో కొత్త పార్టీ అంటున్న అమలాపురం మాజీ ఎంపీ!

ఇలా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇటీవల సంచలన తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   17 Sep 2024 6:55 AM GMT
త్వరలో కొత్త పార్టీ అంటున్న అమలాపురం మాజీ ఎంపీ!
X

ఎస్సీలలో ఉపవర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే! చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం 6:1 మెజార్టీతో ఈ సంచలన తీర్పు వెల్లడించింది. ధర్మాసనంలోని ఆరుగురు న్యాయమూర్తులు ఈ వర్గీకరణను సమర్థించగా.. ఒకరు మాత్రం వ్యతిరేకించారు.

ఇలా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇటీవల సంచలన తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణలోనూ ఈ అంశం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ సమయంలో మాజీ ఎంపీ కొత్త పార్టీ ప్రకటన చేశారు!

అవును... ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అంశం ఇప్పుడు ప్రధానంగా ఏపీలోనూ కీలకంగా మారిన నేపథ్యంలో అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ కీలక ప్రకటన చేశారు. ఇందులో భాగంగా.. వర్గీకరణకు వ్యతిరేకంగా కలిసి వచ్చే వ్యక్తులు, సంఘాలతో కలిసి త్వరలోనే రాష్ట్రంలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు.

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ – క్రిమీలేయర్ ను వ్యతిరేకిస్తూ గుంటూరులో జరిగిన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన జీవీ హర్షకుమార్... రాష్ట్రంలో అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం వర్గీకరణకు అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే కొత్త పార్టీ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెల్లిపారు. త్వరలోనే విధి, విధానాలను ప్రకటిస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా దేశం మొత్తం మీద మాదిగలు ఈ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారని, అయితే.. ఉమ్మడి ఏపీలో మాత్రం మాదిగలు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఓ వ్యక్తి సృష్టించిన ఉద్యమంతో ఉమ్మడి రాష్ట్రాలకు చెందిన మాదిగలు పోరాటంలోకి వెళ్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇదే క్రమంలో... క్రిమీలేయర్ ను పొందుపరిచిన కారణంగా ఉద్యోగస్తుల పిల్లలకు అన్యాయం జరుగుతుందని వెల్లడించారు. ఈ విషయంలో చంద్రబాబు మాయలో పడి ఇతర పార్టీలు కూడా ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించడం లేదని అన్నారు. ఈ క్రమంలోనే... వర్గీకరణకు వ్యతిరేకంగా కలిసి వచ్చే వ్యక్తులు, సంఘాలతో కలిసి త్వరలో కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు.