హర్షసాయికి పోలీసుల ఝలక్.. లుక్అవుట్ నోటీసులు..
యూట్యూబర్ హర్ష సాయి పలు కార్యక్రమాలు చేస్తూ.. పలువురికి సాయం చేస్తూ పాపులర్ అయ్యాడు. ఇటీవల ఆయనపై ఓ యువతి ఫిర్యాదుతో కేసు నమోదైంది.
By: Tupaki Desk | 5 Oct 2024 10:01 AM GMTయూట్యూబర్ హర్ష సాయి పలు కార్యక్రమాలు చేస్తూ.. పలువురికి సాయం చేస్తూ పాపులర్ అయ్యాడు. ఇటీవల ఆయనపై ఓ యువతి ఫిర్యాదుతో కేసు నమోదైంది. తనను హర్షసాయి పెళ్లి చేసుకుంటానని మోసం చేయడమే కాకుండా.. తన నుంచి రూ.2 కోట్లు డబ్బు తీసుకున్నాడని ఆయనపై ఫిర్యాదు చేసింది. హర్షసాయితోపాటు అతని తండ్రి పైనా కంప్లయింట్ ఇచ్చింది. దీంతో అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది.
యువతి ఫిర్యాదు మేరకు యూట్యూబర్ హర్ష సాయి మీద కేసు నమోదు చేసిన పోలీసులు అతని కోసం వెతుకులాట ప్రారంభించారు. అప్పటి నుంచి హర్షసాయి కూడా పరారీలో ఉన్నాడు. మెగా సినిమా కాపీ రైట్స్ కోసం తనపై లైంగిక దాడికి పాల్పడినట్లుగా ఆ యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలోనే హర్షసాయికి పోలీసులు మరో షాక్ ఇచ్చారు.
ఇదిలా ఉండగా.. హర్షసాయికి ముందస్తు బెయిల్ ఇవ్వాలని అతని తండ్రి రాధాకృష్ణ ఇటీవల హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను హైకోర్టు విచారణ చేపట్టింది. రాధాకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులుగా చర్చకముందే బెయిల్ కోసం ఎలా పిటిషన్ వేస్తారని ప్రశ్నించింది. ముందస్తు బెయిల్ కోసం వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. కేసులో నిందితులుగా చేర్చిన తరువాతనే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
ఇదే క్రమంలో ఈ రోజు నార్సింగ్ పోలీసులు హర్షసాయికి మరో ఝలక్ ఇచ్చారు. అతడిపై పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. అత్యాచారం కేసు నమోదైనప్పటి నుంచి హర్షసాయి అజ్ఞాతంలోకి వెళ్లడంతో పోలీసులు స్పెషల్ టీములను ఏర్పాటు చేశారు. అయితే.. హర్షసాయి విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఆ యువతి మరోసారి పోలీసులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు లుక్ అవుట్ నోటీసులు అందించారు. మరోవైపు.. హర్షసాయి బాధితుల నుంచి రోజురోజుకూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా.. హెల్పింగ్ టీమ్ పేరిట తనను మోసం చేశాడంటూ ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.