Begin typing your search above and press return to search.

జగన్ - షర్మిల పై హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు!

ఈ నేపథ్యంలో తాజాగా మీడియా ముందుకు వచ్చిన అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్... షర్మిళకు ఏపీసీసీ చీఫ్ బాధ్యతలు ఇస్తున్నారనే వార్తలపై స్పందించారు!

By:  Tupaki Desk   |   11 Jan 2024 9:58 AM GMT
జగన్ - షర్మిల పై హర్షకుమార్  సంచలన వ్యాఖ్యలు!
X

కర్ణాటక, తెలంగాణల్లో గెలిచిన ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏపీలో కూడా పూర్వవైభవం సంపాదించుకునే దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే వైఎస్ షర్మిళను పార్టీలో చేర్చుకున్నారని.. ఆమెకు త్వరలో ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తారని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సొత్తు అనే విషయాన్ని ఆమెద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేయాలనేది ఆ పార్టీ ఉద్దేశ్యమని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ సంచలన వ్య్యాఖ్యలు చేశారు.

దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుండటంతో ఏపీలోని కాంగ్రెస్ సీనియర్లు కొత్త ఉత్సాహంతో కనిపిస్తున్నారు. మీడియా ముందు కనిపిస్తున్నారు! ఈ క్రమంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్... జీవీ హర్షకుమార్, ఉండవల్లి అరుణ్ కుమార్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా ముందుకు వచ్చిన అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్... షర్మిళకు ఏపీసీసీ చీఫ్ బాధ్యతలు ఇస్తున్నారనే వార్తలపై స్పందించారు!

ఇందులో భాగంగా... ఒకరాష్ట్రంలో చెల్లని నాణెం, ఇంకో రాష్ట్రంలో ఎలా చెల్లుతుంది అని ప్రశ్నించిన హర్ష కుమార్... ఈ రాష్ట్రంలో నాయకులు లేరా.. ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించింది కాదా అని కొత్త చర్చకు తెరలేపారు! ఇదే సమయంలో... నేను రాజన్నబిడ్డని.. నేను హైదరాబాద్ లో పుట్టాను.. హైదరాబాద్ లోనే రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తాను అని షర్మిళ చెప్పారని అన్నారు.

అలాంటి స్టేట్ మెంట్స్ ఇచ్చిన షర్మిళ... ఎన్నికలు వచ్చేనాటికి పోటీచేయ్యలేని పరిస్థితికి వచ్చేశారని అన్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీకి అక్కడ బేషరతుగా మద్దతివ్వడం సంతోషమే అయినప్పటికీ... అందుకు కారణం ఆమెను తెలంగాణ కాంగ్రెస్ నేతలెవరూ ఆమోదించలేదని అన్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఎలా మెలగాలి, ఢిల్లీ నుంచి ఎలాంటి హామీలు పొందాలి అనే ట్రైనింగ్ షర్మిలకు జగన్ ఇచ్చి పంపించారని అన్నారు.

అంటే... "నేను మోడీని చూసుకుంటాను.. నువ్వు సోనియాని చూసుకో" అని జగన్, షర్మిళకు సూచించారని హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫలితంగా... కేంద్రంలో రేపు ఏ ప్రభుత్వం ఏర్పడినా తమకు ఏ ఇబ్బందీ లేకుండా చూసుకుకోవడమే వారి లక్ష్యమని తెలిపారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టాణం జాగ్రత్తగా పరిశీలించాలని హర్షకుమార్ సూచించారు.

ఇదే సమయంలో షర్మిళను కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపుకోవచ్చని, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ పదవి ఇవ్వొచ్చని.. దేశం మొత్తం స్టార్ క్యాంపెయినర్ గా తిప్పుకోవచ్చని.. ఆ విధంగా పార్టీ కోసం ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు కానీ... ఏపీ స్టేట్ బాధ్యతలు మాత్రం ఇవ్వొద్దని ఆయన నొక్కి వక్కానించారు.