కురుక్షేత్రం నుంచి సీఎం కుర్చీకి.. ఈ నాయకుడి గురించి తెలుసా?
కురుక్షేత్రం అంటే మనందరికీ గుర్తొచ్చేది మహా భారతంలో పాండవులు, కౌరవులకు మధ్య యుద్ధం జరిగిన ప్రదేశమే.
By: Tupaki Desk | 12 March 2024 9:39 AM GMTలోక్ సభ ఎన్నికల ముంగిట ఓ ఎంపీ సీఎం అవుతున్నారు. అదికూడా బీజేపీకి గట్టి పట్టున్న రాష్ట్రంలో.. నిన్నమొన్నటివరకు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లో అనుభవం ఉన్న సీనియర్ నాయకులను కాదని యువకులకు, కొత్తవారికి పట్టం కట్టిన కమలనాథులు మరోసారి అలాంటి నిర్ణయమే తీసుకున్నారు. అంతేకాక.. మరో రాష్ట్రంలో ఓబీసీ నాయకుడిని ముఖ్యమంత్రిని చేయనున్నారు. అనూహ్యంగా రాజీనామా చేసిన హరియాణ సీఎం ఖట్టర్ స్థానంలో పట్టం కట్టిన ఆ నాయకుడెవరో తెలుసుకుందామా?
కురుక్షేత్రం అంటే మనందరికీ గుర్తొచ్చేది మహా భారతంలో పాండవులు, కౌరవులకు మధ్య యుద్ధం జరిగిన ప్రదేశమే. అంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రదేశం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు నాయబ్ సింగ్ సైనీ. హరియాణకు కాబోయే ముఖ్యమంత్రి ఈయనే. గత అక్టోబరులో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగానూ నియమితులయ్యారు. ఓబీసీ అయిన సైనీ.. తాజా మాజీ సీఎం ఖట్టర్ కు అత్యంత సన్నిహితులు.
మూడు దశాబ్దాల అనుభవం
సైనీది మూడు దశాబ్దాల రాజకీయ జీవితం. కాంగ్రెస్ కు బలమైన పట్టున్న హరియాణాలో బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేశారీయన. 2002లో బీజేపీ యువ మోర్చా అంబాలా జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. 2005లో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అంతేకాక పార్టీలోని అన్ని విభాగాల్లోనూ పనిచేసుకుంటూ వచ్చారు. కిసాన్ మోర్చాలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు.
ఒక్కసారే ఎమ్మెల్యే.. ఎంపీగా భారీ విజయం
నారాయణగఢ్ నియోజకవర్గం నుంచి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు నాయబ్ సింగ్ సైనీ. 2016లో ఖట్టర్ మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే, 2019లో అసెంబ్లీకి కాకుండా కురుక్షేత్ర నియోజకవర్గం నుంచి ఎంపీగా బరిలోకి దింపారు. కాంగ్రెస్ అభ్యర్థి నిర్మల్ సింగ్ ను ఏకంగా 4 లక్షల ఓట్ల భారీ తేడాతో ఓడించారు. కాగా, ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలను పోటీకి దింపిన బీజేపీ.. ఈసారి ఇంకో ఎంపీని రాష్ట్ర ముఖ్యమంత్రిగా పంపింది. వచ్చే హరియాణ అసెంబ్లీ ఎన్నికలను సైనీ నాయకత్వంలోనే ఎదుర్కొనే చాన్సుంది.