23 కోట్ల రూపాయల దున్న... దీని గురించి తెలుసుకోవాల్సిందే అన్న!
అవును... హర్యానాకు చెందిన అన్మోల్ అనే దున్నకు సంబంధించిన విషయాలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.
By: Tupaki Desk | 16 Nov 2024 3:52 AM GMTసాధారణంగా దున్నలు ఏమి తింటాయంటే... పచ్చిక, తవుడు, ఉలవలు, దూగర, తెలగపిండి మొదలైనవని చెబుతుంటారు! అయితే ఇప్పుడు చెప్పుకోబోయే దున్న లెక్కేవేరు. దాని ఆహారపు అలవాట్లు, దాని బరువు, ధర, టోటల్ లైఫ్ స్టైలే రొటీన్ కి భిన్నంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే... డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్ దీని ఆహారంలో ఓ భాగం.
అవును... హర్యానాకు చెందిన అన్మోల్ అనే దున్నకు సంబంధించిన విషయాలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. విలాసవంతమైన లైఫ్ స్టైల్ లో దీని యవ్వారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఈ దున్న భారతదేశంలో జరిగే వివిధ అగ్రికల్చర్ ఫెయిర్స్ లో అలరిస్తోంది. దీని బరువు అక్షరాలా 1,500 కిలోలు.
ఇలా అత్యంత విభిన్నమైన పరిమాణంతో పాటు వంశపారంపర్యత, సంతానోత్పత్తి సామర్థ్యాలకు ఇది ప్రసిద్ధి చెందిందని అంటున్నారు. ఇక.. దీని వీర్యం విక్రయించడం వల్లే నెలకు సుమారు రూ.4 నుంచి 5 లక్షల వరకూ ఆదాయం వస్తుందని అంటున్నారు. దీని ఖరీదు ఏకంగా రూ.23 కోట్లు అని చెబుతున్నారు.
ఈ సందర్భంగా స్పందించిన ఈ దున్న యజమాని గిల్ స్పందిస్తూ... అన్మోల్ ఆరోగ్యం విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకుంటామని, ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని చెబుతున్నారు. ఇందులో భాగంగా... ఆహారంలో డ్రై ఫ్రూట్స్ అందిస్తూ.. అధిక క్యాలరీలు కలిగి ఉండే వాటిని కలిపి పెడతామని చెబుతున్నారు.
ఇందులో భాగంగా... ప్రతీ రోజూ 250 గ్రాముల బాదం, 5 లీటర్ల పాలు, 30 అరటి పండ్లు, 4 కిలోల దానిమ్మ, ఆయిల్ కేక్, పచ్చి మేత, నెయ్యి, సోయా బీన్స్, మొక్కజొన్న తో పాటు 20 కోడిగుడ్లు కూడా ఆహారంగా ఇస్తున్నారని.. దీని కోసం రోజుకు సుమారు రూ.1500 నుంచి 2000 వరకూ ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నారు.
వీటితో పాటు దున్నకు రోజూ స్నానం చేయిస్తారు. అంతకంటే ముందు బాదం-ఆవాల నూనె ప్రత్యేక మిశ్రమంతో మసాజ్ చేస్తున్నాట్లు చెబుతున్నారు. దీనివల్ల దున్న మరింత నిగనిగలాడుతుందని చెబుతున్నారు. దీనికి అందించే ప్రత్యేక ఆహారం వల్ల.. ఎల్లప్పుడూ సంతానోత్పత్తికి సిద్ధంగా ఉంటుందని యజమాని చెబుతున్నారు.
ఇక దీని వీర్యానికి పశువుల పెంపకందార్లలో మంచి డిమాండ్ ఉందని. ఈ నేపథ్యంలో వారానికి రెండు సార్లు దీని నుంచి వీర్యం సేకరిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ వీర్యం విక్రయించడం వల్ల నెలకు రూ.4 నుంచి 5 లక్షల ఆదాయం వస్తోందని అంటున్నారు. దీని ధర రూ.23 కోట్లు అని చెబుతున్నా.. అమ్మె ఉద్దేశ్యం లేదని, ఇది తమ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉందని చెబుతున్నారు!