Begin typing your search above and press return to search.

హర్యానా 'హ్యాండి' చ్చింది !

తొలి ఫలితాలలో ఏకంగా 50కి పైగా స్థానాలలో లీడ్ లో ఉన్న కాంగ్రెస్ ఆ తర్వాత 36 స్థానాలకు పరిమితం అయింది. బీజేపీ 48 స్థానాలలో ఆధిక్యం ప్రదర్శిస్తుంది.

By:  Tupaki Desk   |   8 Oct 2024 1:52 PM GMT
హర్యానా హ్యాండి చ్చింది !
X

‘తొందరపడి ఒక కోయిల ముందే కూసింది’ అన్నట్లు హర్యానా ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్ అంచనాలు, ఈ ఉదయం వెలువడిన తొలి ఫలితాలను చూసి దేశవ్యాప్తంగా సంబరాలకు పిలుపునిచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు ఊహించని ఝలక్ ఇచ్చారు. తొలి ఫలితాలలో ఏకంగా 50కి పైగా స్థానాలలో లీడ్ లో ఉన్న కాంగ్రెస్ ఆ తర్వాత 36 స్థానాలకు పరిమితం అయింది. బీజేపీ 48 స్థానాలలో ఆధిక్యం ప్రదర్శిస్తుంది.

హర్యానా ఫలితాలపై కాంగ్రెస్ నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఫలితాలు తారుమారు కావడంతో కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ ఈసీ ఎన్నికల ఫలితాలను అప్ డేట్ చేయడం లేదని, దీని వెనక ఏదైనా వత్తిడి ఉందా ? అని ట్వీట్ చేశారు. ఎంపీ శశిథరూర్ ఈ ఫలితాలు అస్సలు ఎగ్జిట్ పోల్స్ ను నమ్మే పరిస్థితి లేకుండా చేశాయని, తమకు హర్యానా మీద ఎన్నో ఆశలు ఉన్నాయని అన్నారు.

హర్యానాలో 90 శాసనసభ స్థానాలు ఉండగా, బీజేపీ 46, కాంగ్రెస్ 36, ఇండియన్ లోక్ దళ్ 2, బీఎస్పీ 1, స్వతంత్రులు 3 స్థానాలలో ముందంజలో ఉన్నాయి. కర్ణాటకలో 5 గ్యారంటీలు, తెలంగాణలో ఆరు గ్యారంటీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ హర్యానా ఎన్నికలలో ప్రతీ మహిళకు నెలకు 2000, వృద్ధాప్య, వికలాంగ, వితంతు పెన్షన్లు నెలకు 6000, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, 300 యూనిట్ల కరెంటు ఫ్రీ, పేదలకు 100 గజాల ప్లాట్, 3.5 లక్షల రొండు గదుల ఇండ్లు, 25 లక్షల ఆరోగ్య భీమా వంటి ఏడు గ్యారంటీలను ఎన్నికల్లో హామీ ఇచ్చింది. కానీ ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీని విశ్వసించలేదు. దీంతో ఈ ఫలితాలు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల మీద ప్రభావం చూపుతాయా అన్న ఆందోళన కాంగ్రెస్ పార్టీలో మొదలయింది.