హర్యానా ముఖ్యమంత్రి ‘జిలేబీ’ పంచ్ లు
హర్యానా రాష్ట్ర రాజకీయాల్లో జిలేబీ కీ రోల్ ప్లే చేస్తోంది. తరచూ ఇదో వార్తాంశంగా మారుతోంది.
By: Tupaki Desk | 2 Nov 2024 6:30 AM GMTహర్యానా రాష్ట్ర రాజకీయాల్లో జిలేబీ కీ రోల్ ప్లే చేస్తోంది. తరచూ ఇదో వార్తాంశంగా మారుతోంది. దీనికి హర్యానా అసెంబ్లీ ఎన్నికల నుంచి బీజం పడింది. ఎన్నికల వేళ జిలేబీ మీద ఎంత చర్చ జరిగిందో తెలిసిందే. దీన్నో అస్త్రంగా కాంగ్రెస్ ప్రయోగించింది. అయితే.. అందరి అంచనాలకు భిన్నంగా కాంగ్రెస్ ఓటమి పాలైతే.. అనూహ్యంగా బీజేపీ అధికారాన్ని ముచ్చటగా మూడోసారి చేపట్టింది. తాజాగా హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ.. జిలేబీ అంశాన్ని మళ్లీ తెర మీదకు తీసుకొచ్చారు. ఎన్నికల వేళలో హాట్ టాపిక్ గా మారిన అంశాన్ని.. తాజాగా టైమ్లీగా తమ రాజకీయ ప్రత్యర్థికి చురకలు అంటించేందుకు జిలేబీని అస్త్రంగా మార్చారు.
ఇంతకీ హర్యానా ఎన్నికల్లో జిలేబీ అంశం ఎందుకంత చర్చగా మారిందన్న విషయంలోకి వెళితే.. కాంగ్రెస్ అగ్రనేతల్లో ఒకరైన రాహుల్ గాంధీ జిలేబీ అంశాన్ని తన ప్రచారంలో ప్రస్తావిస్తూ.. మాథు రామ్ హల్వాయి నుంచి తెచ్చిన జిలేబీ బాక్స్ ను పట్టుకొని.. వాటిని దేశ వ్యాప్తంగా అమ్మాలని.. ఎగుమతి చేయాలని ప్రసంగించారు. ఇలా చేస్తే ఉపాధి పెరుగుతుందని.. ప్రస్తుతం ఆ షాపులో 100 మంది పని చేస్తున్నట్లుగా రాహుల్ పేర్కొన్నారు.
అదే విధంగా ఈ మిఠాయి షాపును విస్తరిస్తే 20 వేల నుంచి 50 వేల మంది వరకు ఉపాధి దొరకవచ్చన్నారు. అక్కడితో ఆగని ఆయన.. ఈ మిఠాయిలను విదేశాలకు సైతం ఎగుమతి చేయొచ్చన్న ఆయన.. మాథురామ్ లాంటి వ్యాపారవేత్తలు.. మోడీ సర్కారు తీసుకొచ్చిన పెద్దనోట్ల రద్దు.. జీఎస్టీ వల్ల ఇబ్బంది పడుతున్నట్లు వ్యాఖ్యానించారు. ఇక్కడితో ఆగని కాంగ్రెస్ పరివారం.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే వేళ కాసింత అత్యుత్సాహాన్ని ప్రదర్శించింది.
ఓట్ల లెక్కింపు ఆరంభంలో కాంగ్రెస్ అధిక్యం కనిపించటంతో తాము అధికారంలోకి వచ్చేస్తున్నట్లుగా కాంగ్రెస్ నేతలు భావించారు. అంతే.. జిలేబీల్ని తీసుకొచ్చి పంచుకోవటం మొదలు పెట్టారు. మధ్యాహ్నానానికి బొమ్మ మొత్తం మారిపోయి బీజేపీ గెలుపు ఖాయం కావటంతో కాంగ్రెస్ నేతలు కంచు తిన్నారు. ఇలాంటి వేళ.. కాంగ్రెస్ కు పంచ్ ఇచ్చేందుకువీలుగా భారీగా జిలేబీలను ఆర్డర్ చేసిన కమలనాథులు.. వాటిని పంచిపెట్టారు.
అప్పటి నుంచి రెండు పార్టీల మధ్య జిలేబీ ఫైట్ నడుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి గొహనా ప్రాంతంలో నిర్వహించిన ఒక ప్రోగ్రాంకు హాజరయ్యారు. అక్కడి మాథు రామ్ హల్వాయి మిఠాయి దుకాణాన్ని సందర్శించి.. మంత్రి అర్వింద్ కుమార్ తో కలిసి జిలేబీలు వేశారు. అనంతరం సోషల్ మీడియాలో స్పందిస్తూ.. మాథు రామ్ జిలేబీనే ఫేమస్ తప్పించి. ఫ్యాక్టరీలో తయారయ్యే జిలేబీలు కావంటూ చురకలు అంటించారు. దీంతో.. మరోసారి జిలేబీ అంశం హర్యానా రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చినట్లైంది. రానున్న రోజుల్లో మరేం జరుగుతుందో చూడాలి.