Begin typing your search above and press return to search.

యమునా నీళ్ల వివాదం... చేతలతో సీఎం సమాధానం... తగ్గని కేజ్రీవాల్!

ఈ సమయంలో హర్యానా సీఎం నాయబ్ సింగ్ కేజ్రీవాల్ విమర్శలకు చేతలతో సమాధానం చెప్పారు!

By:  Tupaki Desk   |   29 Jan 2025 1:07 PM GMT
యమునా నీళ్ల వివాదం... చేతలతో సీఎం సమాధానం... తగ్గని కేజ్రీవాల్!
X

యమునా నదిని హర్యానా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విషపూరితం చేస్తోందంటూ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఈ వ్యాఖ్యలు ఆప్ - హర్యానాలోని బీజేపీ ప్రభుత్వానికి మధ్య వివాదానికి దారితీసింది. ఈ సమయంలో హర్యానా సీఎం నాయబ్ సింగ్ కేజ్రీవాల్ విమర్శలకు చేతలతో సమాధానం చెప్పారు!

అవును... యమునా నదిని హర్యానా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విషపూరితం చేస్తోందంటూ అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు ఢిల్లీ ఎన్నికల వేళ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ఢిల్లీ, హర్యానాలోని బీజేపీ నేతల నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరకూ తీవ్రంగా స్పందించారు. తాను కూడా యమునా నది నీరే తాగుతానని తెలిపారు.

మరోపక్క.. అరవింద్ కేజ్రీవాల్ యమునా నదిని మురుగు కాలువగా మార్చారని ఢిల్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యానాథ్ తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై స్పందించిన అఖిలేష్ యాదవ్... ముందు సొంత రాష్ట్రంలోని పరిస్థితులను సరిచూసుకోవాలని స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

ఇందులో భాగంగా... ఇతరులను సవాల్ చేసే ముందు, విమర్శించే ముందు ఉత్తరప్రదేశ్ లో పరిస్థితి ఎలా ఉందో చూసుకోవాలి.. మథుర నుంచి ప్రవహించే యమునా నది నీరు తాగేందుకు సిద్ధమా..? అని సీఎం యోగి పేరు ప్రస్థావించకుండానే అఖిలేష్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇన్ని పరిణామాల మధ్య హర్యానా సీఎం ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు.

ఇందులో భాగంగా... తాజాగా హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ యమునా నదిలోకి దిగి నీటిని తాగి కేజ్రీవాల్ కు కౌంటర్ ఇచ్చారు. దీంతో... ఈ యమునా నీటి కలుషితంపై విమర్శలు ఇకపై ఆగిపోయే అవకాశాలున్నాయనే చర్చ మొదలైంది.

మరోపక్క.. యమునా నది కలుషితంపై తాను చేసిన వ్యాఖ్యలపై కేజ్రీవాల్ ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా.. ఢిల్లీలో యమునా నీటీలో 7 పార్ట్స్ పర్ మిలియన్ (పీపీఎం) వద్ద ప్రమాదకర స్థాయిలో అమ్మోనియా ఉందని.. 7 పీపీఎం అమ్మోనియా అంటే అది విషంతో సమానమని నొక్కి చెప్పారు.

వాస్తవానికి ఢిల్లీకి సరఫరా అవుతున్న నీటిలో అమ్మోనియా స్థాయిలు సుమారు 3 పీపీఎం ఉండగా.. జనవరి 21 తర్వాత అది 7 పీపీఎంకు పెరిగిందని కేజ్రీవాల్ ఆరోపించారు. హర్యానాలోని బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం నదిని కలుషితం చేస్తూ, ఢిల్లీ ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేస్తోందని పునరుద్ఘాటించారు.