కాంగ్రెస్ కొత్త అస్త్రం: 40 మంది వారసులకు టికెట్లు
90 స్థానాలు ఉన్న హరియాణాలో 40 స్థానాలను వారసులకే ఇవ్వడం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
By: Tupaki Desk | 13 Sep 2024 10:30 AM GMTత్వరలో ఎన్నికలు జరగనున్న హరియాణాపై కాంగ్రెస్ పార్టీ కొత్త అస్త్రం ప్రయోగించింది. మొత్తం 90 స్థానాలున్న హరియాణ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు టికెట్ల కేటాయింపు ప్రక్రియను చేపట్టాయి. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ ఏకపక్షంగా విజయం దక్కించుకుంది. అయితే.. ముఖ్యమంత్రులను మార్చడం ద్వారా.. ఇప్పుడు బీజేపీకి ఇబ్బందులు ఏర్పడ్డాయి.
ఇదిలావుంటే.. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఈ నేపథ్యంలో మెజారిటీ సీట్లను వారసులకు కేటాయించడం గమనార్హం. నిజానికి వారసులకు టికెట్ ఇవ్వడం తప్పుకాకపోయినా.. 90 స్థానా లు ఉన్న హరియాణాలో 40 స్థానాలను వారసులకే ఇవ్వడం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. వీరిలో మాజీ ముఖ్యమంత్రుల కుమారులు.. ఎంపీల కుమారులు, ఎమ్మెల్యేల కుమారులు ఉండడం గమనార్హం. వీరిలో కొందరు స్థానిక నేతల వారసులు, వారసురాళ్లు కూడా ఉండడం గమనార్హం.
టికెట్లు పొందిన వారిలో ప్రముఖులు
+ ఎంపీ రణ్‌దీప్ సూర్జేవాలా కుమారుడు ఆదిత్య సూర్జేవాలా
+ మాజీ ముఖ్యమంత్రి బన్సీలాల్ మనవడు అనిరుధ్ చౌధరీ
+ మాజీ మంత్రి అజయ్ సింగ్ యాదవ్ కుమారుడు చిరంజీవ్ రావు
+ కేంద్ర మాజీ మంత్రి బీరేందర్ సింగ్ కుమారుడు బ్రిజేంద్ర సింగ్
+ మాజీ సీఎం భజన్‌లాల్ బిష్ణోయ్ కుమారుడు చందర్ మోహన్,
+ ఎంపీ జైప్రకాశ్ తనయుడు వికాస్
కొసమెరుపు ఏంటంటే.. ప్రస్తుతం ఎంపీలుగా ఉన్నవారిలో ఐదుగురు ఎమ్మెల్యేలుగా పోటీకి రెడీ అయ్యారు. అయితే.. వారికి మాత్రం పార్టీ అవకాశం ఇవ్వలేదు. ఇదేసమయంలో బీజేపీ మాత్రం తన ఎంపీలను ఎమ్మెల్యేలుగా పోటీ కి నిలుపుతుండడం గమనార్హం. ఇక, ఇలా అంతా వారసులకే అవకాశం ఇవ్వడం వెనుక.. పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు అవకాశం ఇవ్వకుండా.. అందరూ కలిసి పార్టీని గెలుపు గుర్రం ఎక్కిస్తారన్న ఏకైక ఆశ కాంగ్రెస్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది.