Begin typing your search above and press return to search.

కాశ్మీర్..హర్యానా : జనాలు మరీ ఇంత క్లియర్ ఉన్నారే ?

తాజాగా హర్యానా కాశ్మీర్ ఎన్నికలనే తీసుకుంటే రెండు చోట్లా జనాలు కరెక్ట్ గా క్లారిటీగా తీర్పు ఇచ్చారు.

By:  Tupaki Desk   |   9 Oct 2024 4:30 AM GMT
కాశ్మీర్..హర్యానా : జనాలు మరీ ఇంత క్లియర్ ఉన్నారే ?
X

దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. జన చైతన్యం వెల్లి విరుస్తోంది అంటే పోలింగ్ కేంద్రాలకు జనం పెద్ద ఎత్తున తరలి రావడం మాత్రమే కాదు అలా వచ్చిన జనాలు స్పష్టమైన తీర్పుని కూడా ఇస్తున్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా జనాల తీర్పు మాత్రం కచ్చితంగా ఉంటోంది. ఇంకా చెప్పాలీ అంటే వేలు పెట్టలేని విధంగా ఉంటోంది.

తాజాగా హర్యానా కాశ్మీర్ ఎన్నికలనే తీసుకుంటే రెండు చోట్లా జనాలు కరెక్ట్ గా క్లారిటీగా తీర్పు ఇచ్చారు. ఎటువంటి సందేహాలకు తావు కూడా ఇవ్వలేదు. ఎంతటి హోరా హోరీ పోరు సాగినా రేసులో ఎన్ని పార్టీలు ఉన్నా ఎంతటి రాజకీయ గందరగోళం చెలరేగినా కూడా జనాలు మాత్రం ఏ టెన్షన్ లేకుండా ఫుల్ అటెన్షన్ తోనే తీర్పులు ఇస్తున్నారు.

దాని ఫలితమే హర్యనాలో బీజేపీకి పూర్తి మెజారిటీ. అలాగే కాశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమికి స్పష్టమైన ఆధిక్యత. ఇలా రెండు చోట్లా హంగూ కంగారూ లేకుండా జనాలు తీర్పు ఇచ్చిన తీరు అయితే చర్చకు ఆస్కారం కల్పిస్తోంది. నిజానికి చూస్తే కాశ్మీర్ లో ఎన్నో పార్టీలు పోటీ చేశాయి. పైగా జమ్మూలో ఒక రకంగా కాశ్మీర్ లో మరో రకంగా రాజకీయ నేపథ్యం ఉంది. అయినా కూడా హంగ్ వచ్చి అసెంబ్లీలో అస్థిరత్వం ఏర్పడకుండా ఫిరాయింపులు గోడ దూకుళ్ళు రాజకీయ బేర సారాలకూ ఆస్కారం లేకుండా జనాలు మీరే పాలించాలి అంటూ రెండు చోట్లా క్లియర్ కట్ మెజారిటీని ఇచ్చారు.

నిజానికి చూస్తే కాశ్మీర్ లో కానీ హర్యానాలో కానీ ఉన్నవి తొంబై సీట్లు మాత్రమే. చిన్న రాష్ట్రాలుగానే రెండింటినీ చూడాలి. చిన్న రాష్ట్రాలు అయినపుడు తీర్పు కూడా కొంత అటూ ఇటూగా వచ్చిన సందర్భాలు ఉంటాయి. దాంతో వారిని కలుపుకుని వీరిని చేర్చుకుని ప్రభుత్వం ఏర్పాటుకు నానా తంటాలు పడాల్సి ఉంటుంది.

ఇలాంటి ఘటనలు గతంలో జరిగేవి. అంతదాకా ఎందుకు 2014లో కాశ్మీర్ లో ఎన్నికలు జరిగితే ఎవరికీ మెజారిటీ రాలేదు. అపుడు పాతిక సీట్లు ఉన్న బీజేపీ 28 సీట్లు ఉన్న పీడీపీ రెండూ కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఈ రెండు పార్టీల కలయిక కోసం కొనాళ్ళ పాటు రాష్ట్రపతి పాలన కూడా పెట్టాల్సి వచ్చింది. ఇపుడు చూస్తే ఆ పరిస్థితి లేదు. దాంతో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి హ్యాపీగా కాశ్మీర్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అలాగే హర్యానాలో బీజేపీ కూడా మంచి నంబర్ ని సాధించి సుస్థిరమైన ప్రభుత్వాన్ని స్థాపించనుంది.

ఓటర్లలో ఈ రకమైన వివేచన రావడం ద్వారానే రాజకీయ బేరాలకు అవకాశాలు లేకుండా పోతాయని ప్రజాస్వామ్య ప్రియులు అంటున్నారు. అంతే కాదు సుస్థిరమైన ప్రభుత్వం అన్నది ప్రజాస్వామ్యానికి అసలైన బలంగా కూడా చెబుతారు. ఒక ప్రభుత్వం మ్యాజిక్ ఫిగర్ ని సాధించి అధికారంలోకి వస్తే ఇక వెనక్కి చూసుకోకుండా పాలన మీద దృష్టి పెట్టగలుగుతుంది. దేశంలో గతంలో హంగ్ అసెంబ్లీలు చాలా వచ్చాయి. కానీ ఇటీవల కాలంలో మాత్రం స్పష్టమైన ఆధిక్యతలనే జనాలు ఇస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ కూడా హంగ్ అని కాశ్మీర్ లో చెప్పినా జనాల ఓటు క్లారిటీతోనే వేశారని ఫలితాలు నిరూపించాయి.