ఎన్నికల రాష్ట్రంలో.. స్వీపర్ పోస్టుకు లక్ష దరఖాస్తులు
హరియాణాలో స్వీపర్ పోస్టులకు లక్ష మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. జీతంగా రూ..15 వేలు నిర్ణయించారు.
By: Tupaki Desk | 6 Sep 2024 1:30 AM GMTరోడ్లు ఊడ్చే స్వీపర్ పోస్టు.. మహా అయితే జీతం 10 వేలు ఉంటుందేమో?.. ఇంకాస్త సర్కారు దయతలిస్తే 15 వేలు వస్తాయేమో..? దీనికి అర్హతలు కూడా పెద్దగా అవసరం లేదు.. అయితే, ఇందుకోసం పోటీ పడేవారు కూడా తక్కువే. ఎందుకంటే పనిలో ఉండే రిస్క్.. అవమానం తట్టుకోవాల్సి రావడం.. తెల్లవారుజామున విధులకు హాజరు కావాల్సి ఉండడం.. వేధింపులు.. దూషణలు.. ఇంకా అనేక ఇబ్బందులు.. అయితే, ఆ రాష్ట్రంలో మాత్రం స్వీపర్ పోస్టుకు పొలోమంటూ దరఖాస్తులు చేశారు. వారి అర్హతలు చూస్తేనే మతి పోతోంది.
లక్షలాది మంది..
హరియాణాలో స్వీపర్ పోస్టులకు లక్ష మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. జీతంగా రూ..15 వేలు నిర్ణయించారు. దరఖాస్తుదారుల్లో పీజీలు, డిగ్రీలు పూర్తి చేసినవారూ ఉన్నారు. దీంతో అధికారులు అవాక్కయ్యారు. అసలు ట్విస్ట్ ఏమంటే.. ఇదేమీ శాశ్వత ఉద్యోగం కూడా కాదు. కాంట్రాక్ట్ బేసిస్ పై తీసుకునేది. అందుకే అధికారులు ఆశర్యపోతున్నారు. కాగా, దరఖాస్తుదారుల్లో 46 వేల మంది డిగ్రీ చదివినవారే కావడం గమనార్హం.
ఎన్నికల రాష్ట్రంలో ఇదే ప్రధానాంశం
హరియాణాలో వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. పదేళ్లుగా ఈ రాష్ట్రంలో బీజేపీనే అధికారంలో ఉంది. అంతేకాదు.. ధరల పెరుగుదలతో పాటు నిరుద్యోగం హరియాణ యువతను బాగా వేధిస్తోంది. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలే కాదు.. ప్రైవేటు ఉద్యోగాలు కూడా దొరకడం లేదు. ప్రైవేటు ఉద్యోగం దొరికినా.. జీతం రూ.10 వేలు మించి ఇవ్వడం లేదు. ఇది ఎందుకూ చాలడం లేదని నిరుద్యోగులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కాంట్రాక్ట్ స్వీపర్ ఉద్యోగానికి జీతంగా రూ.15 వేలు కావడం, భవిష్యత్తులో పర్మినెంట్ చేస్తారనే ఆశతో లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అసలు ఏ పనీ లేకుండా ఖాళీగా ఉండేకంటే.. ఏదో ఒకటి దొరికింది చాలనేది వారి అభిప్రాయంగా తెలుస్తోంది. తద్వారా ఆర్థిక సమస్యలు, ఇతర ఇబ్బందుల నుంచి బయటపడొచ్చని ఆశిస్తున్నారు.
ఇక్కడే కాదు.. ఉత్తర భారతం అంతటా
హరియాణలోనే కాదు దాదాపు ఉత్తర భారత దేశం అంతటా ఇలాంటి ఉదంతాలు తరచూ కనిపిస్తుంటాయి. బిహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో గతంలో వీటిపై కథనాలు కూడా వచ్చాయి. మరోవైపు దేశవ్యాప్తంగానూ నిరుద్యోగం అతి పెద్ద సమస్యగా మారింది. ఏటా లక్షలాది మంది డిగ్రీలు, పీజీలు పూర్తి చేసుకుంటున్నా వారందరికీ ఉద్యోగాలు దొరకడం లేదు. కొందరు అవసరమైన కోర్సులు చదువుతూ ముందుకెళ్తున్నారు. ఇక రిక్రూటర్లు చెప్పేది మాత్రం వేరే.. తమ వద్ద ఉద్యోగాలు ఉన్నాయని, వాటికి తగిన నైపుణ్యం ఉన్న వారు లేరని అంటున్నారు. కాగా, ప్రభుత్వ ఉద్యోగాలు అయితే భరోసాగా ఉంటుందని కూడా పెద్దఎత్తున దరఖాస్తు చేస్తుంటారు. హరియాణాలో స్వీపర్ పోస్టుకూ ఈ తరహాలో దరఖాస్తు చేయడమే విశేషం.
రోజుల్లోనే లక్షల దరఖాస్తులు..
హరియాణాలో స్వీపర్ పోస్టుల ఖాళీల ప్రకటన వెలువడగానే.. ఎగబడి మరీ దరఖాస్తులు చేసుకున్నారట. రోజుల వ్యవధిలోనే లక్షమంది పైగా దరఖాస్తు పెట్టారని సమాచారం. వీరిలో 6 వేల మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 40 వేల మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు. 1.2 లక్షల మంది డిగ్రీ లోపు చదివినవారు.