Begin typing your search above and press return to search.

రెడ్‌ నోటీస్‌... 19ఏళ్ల హర్యానా గ్యాంగ్‌ స్టర్‌ కోసం ఇంటర్ పోల్ ఎంట్రీ!

అవును... హర్యానాకు చెందిన ఓ 19 ఏళ్ల గ్యాంగ్‌ స్టర్‌ పై ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ (ఇంటర్‌ పోల్) రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేసింది.

By:  Tupaki Desk   |   28 Oct 2023 12:30 AM GMT
రెడ్‌  నోటీస్‌... 19ఏళ్ల హర్యానా గ్యాంగ్‌  స్టర్‌  కోసం ఇంటర్  పోల్  ఎంట్రీ!
X

సాధారణంగా 19ఏళ్ల కుర్రాడంటే ఏమి చేస్తాడు? కాలేజీకి వెళ్తాడు.. చదువు అబ్బకపోతే ఏదో ఒక పనికి పోతుంటాడు.. రెండూ కాకుండా కూడా గడపాలంటే వెనుక సొమ్ములు బలంగా ఉండి అయినా ఉండాలి.. లేకపోతే గాలికి తిరిగే బ్యాచ్ లో ప్రీమియం మెంబర్ అయినా అయ్యి ఉండాలి అని అంటారు! కానీ.. ఇప్పుడు చెప్పబోయే కుర్రాడి వయసు 19 ఏళ్లే కానీ.. అతడు గ్యాంగ్ స్టర్! ఇంటర్ పోల్ రెడ్ నోటీస్ జారీచేసినంత మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్!!

అవును... హర్యానాకు చెందిన ఓ 19 ఏళ్ల గ్యాంగ్‌ స్టర్‌ పై ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ (ఇంటర్‌ పోల్) రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేసింది. నేరపూరిత కుట్రలు, హత్యాయత్నం, నిషేధిత ఆయుధాలు మొదలైటువంటి అభియోగాలపై యోగేష్ కడియన్‌ పై ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలిపింది. ఏమిటి 19 ఏళ్లకే ఇదంతానా అనుకుంటే... పొరపాటే... ఇది మొదలు పెట్టి చాలా కాలమే అయ్యింది!

వివరాళ్లోకి వెళ్తే... హర్యానాలోని ఝజ్జర్‌ జిల్లాకు చెందిన యోగేష్ కడియన్‌ చిన్న వయస్సులోనే తప్పుదోవ పట్టాడంట! ఇందులో భాగంగా చిన్నవయసులోనే... ప్రత్యర్థి గ్యాంగ్‌ స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ ను హతమార్చేందుకు ప్రయత్నిస్తున్న గ్యాంగ్‌ లో ఇతను కూడా చేరినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో 17 ఏళ్ల వయసులోనే నకిలీ పాస్‌ పోర్ట్‌ తో అమెరికా పారిపోయినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయంట.

అనంతరం అమెరికాలో బబిన్హా గ్యాంగ్‌ వద్ద పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. అధునాతన సాంకేతికతో ఆయుధాలు తయారు చేయడంలో యోగేష్ నిపుణుడని.. అతడికి ఖలిస్థానీ ఉగ్రవాదులతో కూడా సంబంధాలున్నాయనే అనుమానాలున్నాయని.. ఈ క్రమంలోనే ఇటీవల ఈ విషయంపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) విచారణ చేపట్టిందని అంటున్నారు.

ఆ విచారణలో భగంగా... ఇతని ఇల్లు, ఇతర రహస్య స్థావరాలపై ఇటీవల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దాడులు చేసిందంట. అనంతరం... ఇతడి ఆచూకి చెప్పిన వారికి 1.5 లక్షల రూపాయలు రివార్డ్ కూడా ప్రకటించింది. ఈ సమయంలో తాజాగా ఇంటర్‌ పోల్ ఎంటరైంది. రెడ్ కార్నర్ నోటీసును జారీ చేసింది.

కాగా... స్వదేశం నుంచి పారిపోయి ఇతర దేశాల్లో దాక్కొన్న నేరగాళ్లను పట్టుకునేందుకు ఇంటర్‌ పోల్‌ ఇలా రెడ్‌ కార్నర్‌ నోటీసులు ఇస్తుందనేది తెలిసిన విషయమే. దీంతో ఇంటర్‌ పోల్‌ సభ్య దేశాలు ఆ నేరగాళ్లను తమ భూభాగంలో ఉంటే వారిని గుర్తించి.. అదుపులోకి తీసుకుంటారు. ఈ క్రమంలోనే... యోగేష్ కడియన్‌ పై ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది.