Begin typing your search above and press return to search.

నెల రోజులవుతోంది.. హసీనాను అప్పగిస్తారా? లేదా? బంగ్లా డిమాండ్

ఇక ఇటీవల హసీనా డిప్లొమాటిక్ పాస్ పోర్టును బంగ్లాదేశ్ లోని మొహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం రద్దు చేసింది

By:  Tupaki Desk   |   2 Sep 2024 12:30 PM GMT
నెల రోజులవుతోంది.. హసీనాను అప్పగిస్తారా? లేదా? బంగ్లా డిమాండ్
X

గత నెల 5న దేశంలో తీవ్రస్థాయి ఆందోళనల నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ కు వచ్చేశారు షేక్ హసీనా. చెల్లెలు షేక్ రెహానాతో కలిసి అప్పటినుంచి ఆమె ఇక్కడ ఉంటున్నారు. తొలుత బ్రిటన్ వెళ్లాలని ప్రయత్నం చేసిన హసీనాకు ఆ దేశం నుంచి అనుమతి లభించలేదు. నెల ముందుగా అభ్యర్థన చేసుకోవాలన్న నిబంధనను చూపుతూ ప్రవేశాన్ని నిరాకరించింది. ఇక ఇటీవల హసీనా డిప్లొమాటిక్ పాస్ పోర్టును బంగ్లాదేశ్ లోని మొహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఆమె వేరే ఏ దేశమూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది.

ఎన్నిసార్లు అడగాలి..

షేక్ హసీనాపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఇప్పటివరకు 53 కేసులు పెట్టింది. ఇందులో 44 హత్య కేసులే. మరో 7 దేశంలో జరిగిన హత్యాకాండాకు సంబంధించినవి. ఇక ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బీఎన్పీ) ఊరేగింపు సందర్భంగా జరిగిన ఘర్షణతో దాడి కేసు కూడా ఒకటి ఉంది. హత్య కేసులన్నీ రిజర్వేషన్లపై ఆందోళనల్లో చనిపోయిన విద్యార్థుల కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నమోదైనవే. ఈ కేసుల్లో హసీనా మాజీ మంత్రులు, అనుచరులు కూడా ఉన్నారు. దీంతోనే హసీనా స్వదేశానికి వెళ్తే ఏం జరుగుతుందో అందరికీ తెలిసిపోతోంది. ఆమె బంగ్లాలో కాలుపెట్టీ పెట్టగానే అరెస్టు చేయడం ఖాయమని స్పష్టమవుతోంది. కాగా, బంగ్లా విదేశీ వ్యవహారాల సలహాదారు ఎండీ తౌహిద్ హుస్సేన్ మాట్లాడుతూ.. హసీనాను అప్పగించమని భారత్ ను పలుసార్లు కోరినా భారత్ స్పందించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఆమెను రప్పించేందుకు యూనస్‌ ప్రభుత్వం ఏమైనా చేస్తుందని కూడా వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్ న్యాయ వ్యవస్థ తలుచుకుంటే హసీనాను ఎలాగైన తీసుకురాగలమని గొప్పలు పోయారు.

ఆమె ఎక్కడుందో భారత్ నే అడగండి

హసీనాను భారత్‌ అప్పగిస్తుందా, లేదా అని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం ప్రశ్నించింది. ఇది భారత్ తీసుకోవాల్సిన నిర్ణయమని ప్రకటించింది. తిరిగి తీసుకురావడానికి ఎలాగైన ప్రయత్నిస్తామని చెప్పింది. భారత్‌ తో వివిధ ఒప్పందాలు, చట్టపరమైన ప్రక్రియలు ఉన్న సంగతిని గుర్తుచేసింది. హసీనా భారత్‌ లో ఎక్కడ ఉన్నదీ తమకు తెలియదని.. సమాధానం కావాలంటే భారత్‌ నే అడగండి అంటూ తౌహిద్ హుస్సేన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా, మొహమ్మద్ యూనుస్ భారత్ కు వ్యతిరేకి. ఆయన సారథ్యంలోని ప్రభుత్వం ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ద్వైపాక్షిక సంబంధాల విషయంలో హసీనా అప్పగింత కీలకం అని బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బీఎన్పీ) పేర్కొంది. హసీనా భారత్‌ లోనే ఉంటే సంబంధాలు దెబ్బతింటాయని హెచ్చరించడం గమనార్హం.