బంగ్లా పాస్ పోర్టు రద్దు.. భారత్ లో వీసా పొడిగింపు.. ఆమె మన దగ్గరే
నాడు యువతిగా ఉన్న ఆమె.. నేడు వయోధికురాలిగా అనుకోని ప్రవాసంలో ఉండాల్సి వస్తోంది.
By: Tupaki Desk | 8 Jan 2025 10:02 AM GMT'పుట్టింటికి ఆడబిడ్డ' అంటే ఇదేనేమో..? ఇప్పటికే ఓ సారి కొన్నేళ్ల పాటు భారత్ లో తలదాచుకున్న ఆమె.. ప్రస్తుతం మళ్లీ కొన్నేళ్లు ప్రవాస జీవితం గడపాల్సి వస్తోంది. అప్పట్లో చెల్లెలుతో కలిసి మన దేశాన్ని ఆశ్రయించిన ఆమె.. ఇప్పుడు అదే చెల్లెలితో భారత్ లో జీవితం గడుపుతున్నారు. నాడు యువతిగా ఉన్న ఆమె.. నేడు వయోధికురాలిగా అనుకోని ప్రవాసంలో ఉండాల్సి వస్తోంది.
నిరుడు ఆగస్టులో అనూహ్యంగా పదవిని కోల్పోయారు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా. స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు రిజర్వేషన్ కొనసాగింపు అంశం తీవ్ర నిరసనలు, హింస, తిరుగుబాటుకు దారితీయడంతో హసీనా అప్పటికప్పుడు రాజీనామా చేసి ఉన్నపళంగా భారత్ కు వచ్చేశారు. ఘజియాబాద్ చేరుకున్న ఆమెకు భారత ప్రభుత్వం ఆతిథ్యం ఇచ్చింది.
ఇది జరిగి ఐదు నెలలైంది. అప్పటినుంచి హసీనా భారత్ లోనే ఉంటున్నారు. బంగ్లాదేశ్ నుంచి తొలుత బ్రిటన్ వెళ్లాలని భావించినా హసీనా వచ్చేందుకు ఆ దేశ ప్రభుత్వం అంగీకరించ లేదు. దీంతో ఢిల్లీకి చేరుకున్నారు. తర్వాత ఆమె ఎక్కడకు వెళ్లేదీ తేలలేదు.
కేసులే కేసులు..
మొహమ్మద్ యూనస్ సారథ్యంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం షేక్ హసీనాపై కేసుల మీద కేసులు నమోదు చేస్తోంది. ఇప్పటికే వీటి సంఖ్య 50 దాటింది. దీంతో హసీనా ఒకవేళ బంగ్లాదేశ్ కు వెళ్లినా జైలు పాలు కాక తప్పదు. మరోవైపు ఆమె పార్టీ క్యాడర్ చెల్లాచెదురైంది. వీటన్నటి మధ్య హసీనా పాస్ పోర్టును రద్దు చేసింది బంగ్లా ప్రభుత్వం. ఇప్పటికే ఆమెను తమకు అప్పగించాలని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం కోరుతోంది. అది నెరవేరకపోవడంతో పాస్ పోర్టును రద్దు చేసింది. అయితే, అంతే వేగంగా భారత్ స్పందించింది. హసీనా వీసా గడువును పొడిగించింది. దీంతో మరికొంత కాలం భారత్ లో ఉండేందుకు అవకాశం ఏర్పడింది.
ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ కార్యాయలం అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వం పరిశీలించి హసీనా వీసా పొడిగింపునకు నిర్ణయం తీసుకుంది. హసీనా కు శరణార్థిగా ఆశ్రయం కల్పించడం మాత్రం అబద్ధం అని తేల్చి చెప్పింది.