Begin typing your search above and press return to search.

గులాబీ బాస్ రీఎంట్రీకి టైం ఫిక్స్ చేశారా?

కాస్తంత గ్యాప్ తో ప్రజల్లోకి వెళ్లే వేళ.. ఆయన రీఎంట్రీ ప్రోగ్రాంను గ్రాండ్ గా ఉండాలన్నట్లుగా ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   14 Jan 2024 5:12 AM GMT
గులాబీ బాస్ రీఎంట్రీకి టైం ఫిక్స్ చేశారా?
X

తనకు తిరుగులేదన్నట్లుగా ఉండే గులాబీ బాస్ కేసీఆర్ కు గడిచిన కొద్ది రోజులుగా టైం అస్సలు బాగోలేకపోవటం తెలిసిందే. అంచనాలకు మించి.. ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలు కావటం ఒక ఎత్తు అయితే.. ఎప్పుడూ ఎలాంటి ప్రమాదం బారిన పడని ఆయన.. అందుకు భిన్నంగా ఎన్నికల పలితాలు వెల్లడై.. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన గంటల వ్యవధిలోనూ ఫాంహౌస్ లోని బాత్రూంలో కాలుజారి పడటం.. తుంటి ఎముక విరగటం.. ఆసుపత్రిలో చేరటం లాంటి పరిణామాలు వరుసగా చోటు చేసుకోవటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. బాత్రూం ఘటన తర్వాత.. బెడ్ రెస్టుకు పరిమితమైన ఆయన.. తనను పరామర్శించే వారిని కలుస్తూ.. హైదరాబాద్ లోని నంది హిల్స్ లోని ఇంటికే పరిమితం కావటం తెలిసిందే. మరో రెండు నెలల్లో లోక్ సభ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో.. ఆయన రీఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. కాస్తంత గ్యాప్ తో ప్రజల్లోకి వెళ్లే వేళ.. ఆయన రీఎంట్రీ ప్రోగ్రాంను గ్రాండ్ గా ఉండాలన్నట్లుగా ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే నెల (ఫిబ్రవరి 17న) కేసీఆర్ పుట్టిన రోజు. దీనికి మించిన మంచి సందర్భం ఇంకొకటి ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తన పుట్టిన రోజున గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్న ఆయనకు తెలంగాణ భవన్ లో స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా జంట నగరాల్లో భారీఎత్తున హోర్డింగులు.. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి జనం మధ్యకు వచ్చే సందర్భం గ్రాండ్ గా ఉండాలన్నది గులాబీ నాయకత్వ ఆలోచనగా చెబుతున్నారు.

అంతేకాదు.. పార్టీకి చెందిన ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు సైతం ఆరోజు గులాబీ బిగ్ బాస్ ను కలుస్తారని.. ఇందుకు తెలంగాణ భవన్ వేదికగా మారుతుందని చెబుతున్నారు. గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత తననుమూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించిన గజ్వేల్ కు ఫిబ్రవరి 20 తర్వాత వెళ్లి.. నియోజకవర్గ ప్రజలతో మమేకం అవుతారని భావిస్తున్నారు. ఇందుకు.. తగ్గట్లుగా భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. వీటికి కొనసాగింపుగా.. లోక్ సభ ఎన్నికలకు కాస్త ముందుగా వరంగల్ లో భారీ సభను ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సభ ద్వారా పార్టీ బలాన్ని ప్రదర్శించేలా ఉండాలన్నది గులాబీ నేతల ఆలోచనగా చెబుతున్నారు.