అసెంబ్లీని బాయ్ కాట్ చేయడానికి వైసీపీకి కారణం దొరికిందా ?
ఇపుడు చూస్తే కేవలం 11 మంది మాత్రమే ఉన్నారు. దాంతో ఎన్నాళ్ళు విపక్ష పాత్ర పోషిస్తారు అన్నది కూడా చర్చగా ఉంది. ఎటూ అధికార పక్షం అసెంబ్లీలో మంచి దూకుడు మీద ఉంటుంది.
By: Tupaki Desk | 20 Jun 2024 3:15 AM GMTవైసీపీకి సభా పర్వం ఈసారి ఏ మాత్రం అచ్చి రాలేదు. పైగా ఉత్సాహం కూడా లేదు. ఎందువల్ల అంటే మొత్తం అసెంబ్లీ నిండా టీడీపీ కూటమి పరచుకుంది. జస్ట్ 11 మంది మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కనీసం ప్రతిపక్ష హోదా లేదు. అది కనుక ఉంటే అపొజిషన్ బెంచీలలో ఎంతో కొంత హడావుడి చేయవచ్చు.
రూల్స్ నిబంధనల ప్రకారం అంతా జరుగుతుంది. బిజినెస్ అడ్వైజరీ కమిటీలో కీలక పాత్ర పోషించవచ్చు. అంతే కాదు ప్రతిపక్షానికి ఇచ్చే కేబినెట్ ర్యాంక్ పోస్ట్ అయిన పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ పదవి కూడా ఒకరికి దక్కుతుంది. ఇలా అనేక లాభాలు ఉన్నాయి.
కానీ 11 మంది మాత్రమే ఉండడంతో నీరసం నిలువునా వస్తోంది. ఇక అసెంబ్లీలో నిన్నటిదాకా 151 మంది ఎమ్మెల్యేలతో సీఎం గా ఉన్న జగన్ ఈసారి ఒక సాధారణ సభ్యుడిగా హాజరు కావాల్సి రావడం కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది.
అయితే ప్రజాస్వామ్యంలో గెలిస్తేనే అసెంబ్లీకి వెళ్తారా అన్న చర్చ జనంలో వస్తుంది. అధికారం ఇస్తేనే సభకు వెళ్తారా అని ప్రజల నుంచి ప్రశ్నలూ వస్తాయి. మేధావుల నుంచి అయితే ఎన్నో ప్రశ్నలు వస్తాయి. అందువల్ల ఇబ్బంది ఉన్నా కూడా సభకు వెళ్ళాల్సిందే. కనీసం కొన్నాళ్ళు అయినా హాజరు వేయించుకోవాల్సిందే.
కేవలం 23 మందితో చంద్రబాబు 2019లో సభకు హాజరై తన నిబద్ధత చాటుకున్నారు ఆ తరువాత నలుగురు ఎమ్మెల్యేలు పార్టీని విడిచి వెళ్ళినా ఆయన మిగిలిన 19 మందితోనే అసెంబ్లీకి వచ్చారు. అలా రెండున్నరేళ్ల పాటు బాబు సభలో కనిపించారు. అనేక అంశాల మీద అధికార పక్షాన్ని నిలదీశారు.
ఇపుడు వైసీపీ కూడా అలాగే చేయాలని జనాలు కోరుకుంటారు. అసెంబ్లీ వేదికగా కొన్నాళ్ళు అయినా పోరాడాలి. ఇపుడే జనంలోకి వస్తే ఏ మాత్రం బాగుండదు, కొత్త ప్రభుత్వం మీద జనాలు కోటి ఆశలు పెట్టుకున్నారు. విపక్షం రోడ్ల మీదకు వచ్చినా వారు పట్టించుకుంటారు అన్న గ్యారెంటీ అయితే లేదు.
ఈ నేపధ్యంలో వైసీపీ ముందు ఎన్నో ధర్మ సంకటాలు ఉన్నాయి. పైగా అసెంబ్లీకి వెళ్తే స్పీకర్ ఎలా వ్యవహరిస్తారో అన్న డౌట్లూ ఉండనే ఉన్నాయి. ఇపుడు దానికి తోడు అన్నట్లుగా సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుని ఏరి కోరి స్పీకర్ గా నియమిస్తున్నారు.
ఆయన భాష కటువుగా ఉంటుంది. పల్లెటూరి భాషలో చాలా అసభ్య పదాలు కూడా దొర్లుతాయి. అలా ఆయన సభలో విపక్షం మీద ఘాటు వ్యాఖ్యలు చేయవచ్చు కూడా. అందుకే ఇపుడు వైసీపీకి స్పీకర్ తో ఎలా అన్న చర్చ కూడా సాగుతోందిట. అయితే ఇదే సాకుగా చేసుకుని అసెంబ్లీని బాయ్ కాట్ చేయడానికి కూడా వీలు చేసుకోవచ్చు అన్న ప్రచారం కూడా సాగుతోంది.
అయ్యన్న ఫైర్ బ్రాండ్. దాంతో ఆయన మాట తూలి ఏమైనా అంటే అదే కారణంగా చూపించి అసెంబ్లీని బాయ్ కాట్ చేయడానికి కూడా వైసీపీ చూస్తుంది అని అంటున్నారు. అసెంబ్లీలో వైసీపీ అయిదేళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది అని ఎవరూ అనుకోవడం లేదు అని కూడా చెబుతున్నారు. 67 మందితో 2014లో గెలిస్తేనే మూడేళ్ళ పాటు మాత్రమే వైసీపీ సభలో విపక్ష స్థానంలో ఉంది. మిగిలిన రెండేళ్ళూ బాయ్ కాట్ చేసింది.
ఇపుడు చూస్తే కేవలం 11 మంది మాత్రమే ఉన్నారు. దాంతో ఎన్నాళ్ళు విపక్ష పాత్ర పోషిస్తారు అన్నది కూడా చర్చగా ఉంది. ఎటూ అధికార పక్షం అసెంబ్లీలో మంచి దూకుడు మీద ఉంటుంది. గత ప్రభుత్వం వైఫల్యాల మీద విమర్శలు చేస్తుంది. దానిని జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది కానీ చెప్పనిస్తారా అన్నది కూడా డౌటే అంటున్నారు.
అలా ఏ విధంగా చూసినా ఈసారి అసెంబ్లీ మాత్రం ఏకపక్షంగా ఉండబోతోంది. విపక్షానికి కడు ఇబ్బందిగా మారుతోంది అని అంటున్నారు. మరి అయ్యన్ననే కారణంగా చూపించి ఏకంగా సభను బాయ్ కాట్ చేస్తారా అన్నది చూడాలి. అయితే తొలి రోజుల్లోనే బాయ్ కాట్ చేస్తే జనాలకు అది ఎక్కదు, కనీసంగా కొన్నాళ్ల పాటు అయినా సభలో ఉండాలి. అధికార పక్షం దూకుడుని భరించాల్సిందే అని అంటున్నారు. మరి ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది.