ఈవీఎంలను హ్యాక్ చేశారా..? మోడీకి పెరుగుతున్న ముప్పు
మధ్యలో రెండు మూడు నెలలు గడిచిన తర్వాత.. 32 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను దొడ్డిదారిలో తెచ్చుకుని.. ఇక్కడ బీజేపీ అధికారం చేపట్టింది.
By: Tupaki Desk | 7 Dec 2023 2:30 AM GMTమధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఎవరూ ఊహించని.. కనీవినీ ఎరుగని రీతిలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. వాస్తవానికి ఇక్కడ అధికార పార్టీ బీజేపీనే. ఇంకోమాటలో చెప్పాలంటే.. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాలేదు. మధ్యలో రెండు మూడు నెలలు గడిచిన తర్వాత.. 32 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను దొడ్డిదారిలో తెచ్చుకుని.. ఇక్కడ బీజేపీ అధికారం చేపట్టింది. ఇలాంటి రాష్ట్రంలో అనూహ్యంగా ఇప్పుడు 166 స్థానాల్లో బీజేపీ విజయం సాదించింది.
ఇదే.. ఇప్పుడు సర్వత్రా విస్మయానికి కారణమైంది. మరోవైపు, క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమనించిన కాంగ్రెస్ నాయకులు.. అసలు ఈ ఫలితం ఏంటి? ఈ విధానం ఏంటి? అనే విషయంపై దృష్టి పెట్టారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో అత్యధిక సీట్లున్న రాష్ట్రం మధ్యప్రదేశే. ఇక్కడ ఏకంగా 230 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ పాగా వేయడం ద్వారా.. లోక్‌సభ ఎన్నికల్లో మరింత లబ్ధి పొందేందుకు జాతీయ పార్టీలకు అవకాశం ఉంటుంది.
ఈ వ్యవహారమే ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. పైగా.. కాంగ్రెస్ అభ్యర్థులకు వారి వారి సొంత గ్రామాల్లో కనీసం.. 50 ఓట్లు కూడా రాకపోవడం.. బీజేపీ కార్యకర్తలు.. కౌంటింగుకు రెండు రోజుల ముందే.. అభ్యర్థుల మెజారిటీని పేర్కొంటూ.. సోషల్ మీడియాలో పేర్కొనడం.. అవి అక్షరాలా సత్యం కావడం.. వంటివి బీజేపీకి ఉచ్చు బిగించేలా చేస్తున్నారు. ఈ విషయంపైనే కాంగ్రెస్ కూడా సీరియస్‌గా దృష్టి పెట్టింది.
ఈవీఎంలను హ్యాక్ చేయడం లేదా.. ట్యాంపరింగ్ చేయడం ద్వారానే మోడీ విజయం దక్కించుకున్నార నేది ప్రధాన ఆరోపణగా ఉంది. ఇది రాజకీయ విమర్శగా కొట్టి పారేసే అవకాశం లేదని కూడా చెబుతున్నారు. ఆధారాలు, సాక్ష్యాలు కూడా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. దీంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని దేశవ్యాప్తంగా మోడీకి వ్యతిరేకంగా క్యాంపెయిన్లు నిర్వహించేందుకు కాంగ్రెస్ రెడీ అవుతోంది. కొంత ఉన్న రాష్ట్రంలో ఎంతో ఉందని తేల్చేసిన ప్రస్తుత ఎన్నికలు బీజేపీకి ఇరకాటంగా మారడం గమనార్హం.