Begin typing your search above and press return to search.

సొంత నేతలే ముంచారా ?

సిట్టింగ్ ఎంఎల్ఏలకు మద్దతుగా పనిచేయటం ఇష్టంలేని చాలామంది సొంతనేతలే అభ్యర్ధుల ఓటమికి పనిచేశారని ఆరోపించారు.

By:  Tupaki Desk   |   8 Jan 2024 12:30 PM GMT
సొంత నేతలే ముంచారా ?
X

రాబోయే పార్లమెంటు ఎన్నికలకు బీఆర్ఎస్ రెడీ అవుతోంది. 17 పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఎంఎల్ఏలు, మాజీమంత్రులు, ముఖ్యనేతలతో వర్కింగ్ ప్రెసిడెంట్, హరీష్ రావు సమీక్షలు చేస్తున్నారు. పార్టీ ఆఫీసులో జరిగిన జహీరాబాద్ పార్లమెంటు సమీక్షలో సీనియర్లు నిర్మొహమాటంగా అనేక అంశాలను ప్రస్తావించారు. మాజీ స్పీకర్, ప్రస్తుత ఎంఎల్ఏ పోచారం శ్రీనివాసు రెడ్డి మాట్లాడుతు సొంతనేతలే పార్టీని ఓడించినట్లు కుండబద్దలు కొట్టారు. సిట్టింగ్ ఎంఎల్ఏలకు మద్దతుగా పనిచేయటం ఇష్టంలేని చాలామంది సొంతనేతలే అభ్యర్ధుల ఓటమికి పనిచేశారని ఆరోపించారు.

ద్వితీయశ్రేణి నేతలు. కార్యకర్తలు అభ్యర్ధుల ఓటమికి పనిచేశారంటే అది వారి తప్పుకాదన్నారు. కొందరు మంత్రులు, కొంతమంది ఎంఎల్ఏల వ్యవహార శైలి అప్పట్లో ఆ విధంగా ఉండేదన్నారు. మంత్రులు, ఎంఎల్ఏలుగా పనిచేసిన వారిలో అత్యధికులు ద్వితీయశ్రేణి నేతలు, క్యాడర్ను ఏమాత్రం పట్టించుకోలేదని పోచారం మండిపోయారు. అరాచకాలు, అవినీతి కారణంగా జనాల్లో కూడా బాగా వ్యతిరేకతను తెచ్చుకున్నట్లు చెప్పారు. ఇలాంటి అనేక కారణాల పలితంగానే జనాలు బీఆర్ఎస్ అభ్యర్ధులకు వ్యతిరకంగా ఓట్లేసినట్లు చెప్పారు.

పార్టీలో పూర్తిస్ధాయి ప్రక్షాళన జరగాలని స్పష్టంగా చెప్పారు. లేకపోతే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా కష్టమే అని పరోక్షంగా హెచ్చరించారు. ఇదే సమయంలో మాజీమంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతు బీఆర్ఎస్ సొంత తప్పిదాల వల్లే ఎన్నికల్లో ఓడిపోయిందన్నారు. జనాల దృష్టిని తనవైపుకు తిప్పుకోవటంలో కాంగ్రెస్ సక్సెస్ అయినట్లు రెడ్డి చెప్పారు. ఎన్నికల్లో గెలుపుకు పార్టీ క్యాడర్ పూర్తిగా దూరమైపోయిందన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో జరగిన తప్పులను పునరావృతం కానీయకుండా రేపటి పార్లమెంటు ఎన్నికల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇపుడు పోచారం, నిరంజన్ రెడ్డి చెప్పిన విషయాలే చాలామంది నేతల్లో ఉంది. ఇదే విషయాలను అప్పట్లోనే కేసీయార్, కేటీయార్ కు చెబితే అప్పుడు వీళ్ళెవరిని లెక్కచేయలేదు. అంతా అయిపోయిన తర్వాత ఇపుడు తీరిగ్గా పోస్టుమార్టమ్ పెట్టి జరిగిన తప్పులను కేటీయార్ అంగీకరించటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో అయినా సీనియర్ల అభిప్రాయాలకు విలువిచ్చి అభ్యర్ధులను ఎంపికచేస్తే బాగుంటుందని పార్టీలో టాక్ వినిపిస్తోంది.