Begin typing your search above and press return to search.

'మతం'తొ బీజేపీ ప్రచారంపై షా మాటలు విన్నారా?

మతం ప్రాతిపదికన ప్రచారం చేస్తూ ఈ ఎన్నికల్లో బీజేపీ అనుసరిస్తున్న విధానాలపై వస్తున్న విమర్శలపై బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన అమిత్ షా స్పందించారు.

By:  Tupaki Desk   |   27 May 2024 4:22 AM GMT
మతంతొ బీజేపీ ప్రచారంపై షా మాటలు విన్నారా?
X

సార్వత్రిక ఎన్నికల వేళ అధికార బీజేపీ.. విపక్షాలు కలిసి వాడి వేడిగా విమర్శలు సంధించుకోవటం తెలిసిందే. ఈసీని తన గుప్పిట్లో ఉంచుకొని తనకు తోచినట్లుగా బీజేపీ నడిపిస్తోందని ఇండియా కూటమి ఆరోపణలు చేయటం తెలిసిందే. అయితే.. ఈ విమర్శలకు అంతే తీవ్రంగా కౌంటర్ ఇస్తున్నారు కమలనాథులు. మతం ప్రాతిపదికన ప్రచారం చేస్తూ ఈ ఎన్నికల్లో బీజేపీ అనుసరిస్తున్న విధానాలపై వస్తున్న విమర్శలపై బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన అమిత్ షా స్పందించారు.

విపక్షాల మండిపాటుకు అంతే తీవ్రంగా కౌంటర్ ఇచ్చిన ఆయన.. విపక్షాల విమర్శలకు జడిసేదే లేదని తేల్చేశారు. ఆర్టికల్ 370 రద్దు.. ఉమ్మడి పౌరస్ర్మతి.. ముస్లింలకు కోటాను వ్యతిరేకిస్తూ ఎన్నికల ప్రచారంలో బీజేపీ మతాన్ని ముందుకు తెస్తుందన్న విమర్శలకు తాము తగ్గేదేలేదని తేల్చేస్తున్నారు. ఎవరెన్ని అన్నా.. తమ దారిలో తాము నడుస్తామని కుండ బద్ధలు కొడుతున్న ఆయన.. తాము చేసిన పనుల్నే చెబుతున్నామని.. అలాంటప్పుడు తమను ఎలా తప్పు పడతారు? అని ప్రశ్నిస్తున్నారు.

రాజ్యాంగంలో లేని విధంగా మత ప్రాతిపదికన ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తామని విపక్షాలు చెబుతుంటే తాము వ్యతిరేకిస్తున్నామని.. ఆర్టికల్ రద్దు.. ఉమ్మడి పౌరస్మ్రతిపై తాము చేసిందే చెప్పామే తప్పించి.. కొత్తగా ఏమీ చెప్పట్లేదుగా? అని ప్రశ్నిస్తున్నారు. ఈసీపై చేస్తున్న ఆరోపణల్ని ఆయన కొట్టిపారేశారు. తెలంగాణ.. పశ్చిమబెంగాల్.. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఈసీ ఏ రీతిలో పని చేసిందో.. ఇప్పుడే అలానే చేస్తోంది. అప్పుడు ఆ ఎన్నికలు పారదర్శకంగా జరిగితే.. ఈ ఎన్నికలు కూడా అంతే పారదర్శకంగా జరుగుతున్నట్లే లెక్క కదా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు ధీమాను మరోసారి ప్రదర్శించిన అమిత్ షా.. ఇండియా కూటమి విమర్శలపై చురకలు అంటించారు. తాము 399 సీట్లు సాధిస్తే.. మీకు 400 సీట్లు రాలేదు కదా? అని విపక్షాలు విమర్శిస్తే అది వారికే వదిలేస్తామని.. ఈసారి 400సీట్లు గెలుస్తామన్నది తమ నినాదం కాదన్నారు. విజయవకాశాల్ని లెక్క కట్టి చెప్పిన సంఖ్య మాత్రమేనని చెప్పిన ఆయన.. కాంగ్రెస్ ఇస్తున్న ఎన్నికల హామీల్ని తీవ్రంగా తప్పు పట్టారు.

ఈ ఎన్నికల్లో వచ్చే ఫలితాలపై అమిత్ షా అంచనాల్ని చెబుతూ.. ఏపీలో తమ కూటమికి విజయవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీలో తాము అధికారంలోకి రానున్నట్లుగా చెప్పిన ఆయన.. పశ్చిమ బెంగాల్ లో 24-30 సీట్లు.. ఒడిశాలో 16-17 సీట్లు గెలుస్తామని.. తమిళనాడులో ఓటు షేర్ పెంచుకోనున్నట్లు చెప్పిన ఆయన.. కేరళలో ఈసారి బోణీ కొడతామని చెప్పారు. వేసవిలో కాకుండా ఒకే దేశం - ఒకే ఎన్నికల్ని అమలు చేస్తామని.. దేశమంతా ఉమ్మడి పౌరస్మ్రతిని అమలు చేయనున్నట్లు చెప్పిన షా మాటలు ఆసక్తికరంగా మారాయి.