Begin typing your search above and press return to search.

అమెరికాలో భారీ విస్ఫోటనం... విష వాయువులతో ఆందోళన

అమెరికాలో మరోసారి అగ్ని పర్వతం భారీ విస్ఫోటనంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది.

By:  Tupaki Desk   |   24 Dec 2024 6:02 AM GMT
అమెరికాలో భారీ విస్ఫోటనం... విష వాయువులతో ఆందోళన
X

అమెరికాలో మరోసారి అగ్ని పర్వతం భారీ విస్ఫోటనంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది. లాస్ ఏంజిల్స్‌లోని హవాయ్‌ బిగ్‌ ఐలాండ్‌లో ఉండే అతి పురాతనమైన కిలోవెయా అనే అగ్నిపర్వతం బద్దలైంది. స్థానిక మీడియా, ప్రభుత్వ అధికారులు తెలియజేసిన ప్రకారం తెల్లవారుజామున 2 గంటల 20 నిమిషాల సమయంలో ఈ భారీ అగ్నిపర్వతం విస్ఫోటనం జరిగింది. విస్ఫోటనం సమయంలో అగ్ని పర్వతం నుంచి 260 అడుగుల ఎత్తు వరకు లావా ఎగసి పడ్డట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో మీడియా సంస్థల వారు షేర్‌ చేస్తున్నారు.

అగ్నిపర్వతం నుంచి లావా ఎగసి పడుతూ, పొగలు కక్కుతూ ముందుకు వస్తున్న వీడియోలను వోల్కనాలజిస్టులు విడుదల చేశారు. అదే సమయంలో హవాయ్ బిగ్ ఐలాండ్‌ సమీపంలో ఉన్న వారిని హెచ్చరిస్తూ సందేశాలు పంపించారు. పదుల కిలో మీటర్ల దూరంలో ఉన్న వారిని పూర్తిగా ఖాళీ చేయించాలి అంటూ ప్రభుత్వానికి సిఫార్సులు చేశారు. భారీ విస్ఫోటనం వల్ల భయంకరమైన లావా ముందుకు వస్తుందని అంతే కాకుండా అత్యంత విషపూరిత వాయువులు సైతం వాతావరణంలో కలుస్తున్నాయని వారు హెచ్చరిస్తూ ఒక రిపోర్ట్‌ను ఇప్పటికే ప్రభుత్వంకు అందజేశారని తెలుస్తోంది.

ఈ ప్రమాదకర వాయువుల కారణంగా పంట పొలాలు, జీవ రాశులపై తీవ్ర ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. రాబోయే కొన్నాళ్ళ వరకు ఈ ప్రభావం ఉంటుందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలను సాధ్యం అయినంత వరకు ఇతర ప్రాంతాలకు ఇప్పటికే తరలించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం హవాయ్ బిగ్‌ ఐలాండ్‌లోని కిలోవెయా అగ్ని పర్వతం బద్దలైన విషయం గురించి సోషల్‌ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.

1983 నుంచి కిలోవెయా అగ్ని పర్వతం గురించి చర్చలు జరుగుతున్నాయి. ఎ సమయంలో అయినా అగ్ని పర్వతం బద్దలు కావచ్చు అంటూ గతంలోనే శాస్త్రవేత్తలు చెబుతూ వచ్చారు. ఇప్పుడు అదే జరిగింది. గతంలోనూ ఈ అగ్ని పర్వతం నుంచి స్పల్ప స్థాయిలో విస్ఫోటనాలు జరిగాయి. కానీ ఈ స్థాయిలో లావా ఎగసి పడటం జరగలేదు. ఏకంగా 260 అడుగుల ఎత్తు వరకు లావా ఎగసి పడుతుండటం అంటే మామూలు విషయం కాదని, ఇది అతి పెద్ద విస్ఫోటనంగా చెప్పుకుంటున్నారు. భవిష్యత్తులో మళ్లీ కిలోవెయా అగ్నిపర్వతం బద్దలయ్యే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.