Begin typing your search above and press return to search.

హెచ్.సీ.ఎల్. ఆఫీస్ వాష్ రూమ్ లో టెకీ మృతి... ఏం జరిగింది?

ఇటీవల కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు ఆఫీసుల్లో మృత్యువాతపడుతున్న ఘటనలు వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   30 Sep 2024 12:30 PM GMT
హెచ్.సీ.ఎల్.  ఆఫీస్  వాష్  రూమ్  లో టెకీ మృతి... ఏం జరిగింది?
X

ఇటీవల కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు ఆఫీసుల్లో మృత్యువాతపడుతున్న ఘటనలు వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థలో సీఏగా పనిచేసిన అన్నా సెబాస్టియన్ మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. పని ఒత్తిడితోనే ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.

మరోపక్క గతవారం హెచ్.డీ.ఎఫ్.సీ. ఉద్యోగి సదాఫ్ ఫాతిమా అనే మహిళ బ్యాంక్ లోనే గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఇటీవల తమిళనాడులోనూ ఓ ఉద్యోగి పని ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు కథనాలొచ్చాయి! ఈ క్రమంలో తాజాగా ప్రముఖ ఐటీ సంస్థ హెచ్.సీ.ఎల్. లో పనిచేస్తోన్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి వెలుగులోకి వచ్చింది.

అవును... తాజాగా ప్రముఖ ఐటీ సంస్థలో పనిచేస్తున్న టెకీ తన కార్యాలయం వాష్ రూమ్ లోనే గుండెపోటుతో మృతి చెండిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వివరాళ్లోకి వెళ్తే... మహారాష్త్రలోని నాగ్ పూర్ లో గల హెచ్.సీ.ఎల్. లో పనిచేస్తున్న 40 ఏళ్ల సీనియర్ అనలిస్ట్ నితిన్ ఎడ్విన్ మైఖేల్ శుక్రవారం రాత్రి 7 గంటలకు ఆఫీసులోని వాష్ రూమ్ కు వెళ్లాడు. అయితే... కాసేపటి తర్వాత కొలీగ్స్ వెళ్లి చూడగా కిందపడిపోయి ఉన్నాడు. దీంతో ఆందోళనకు గురైన వారు.. వెంటనే క్యాంపస్ క్లీనిక్ కి తీసుకెళ్లారు.

అక్కడ నుంచి నాగ్ పూర్ లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఏఐఐఎంఎస్) కు తరలించారు. ఇదే సమయంలో పోలీసులకూ సమాచారం అందించారు. అయితే... ఆస్పత్రికి చేరుకునేసరికే నితిన్ ఎడ్విన్ మైఖేల్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ ఘటనపై స్పందించిన పోలీసులు... గుండెపోటు కారణంగానే అతడు చనిపోయినట్లు ప్రాథమిక పరీక్షలో తేలిందని చెప్పారు. పని ఒత్తిడితో ఉద్యోగులు చనిపోతున్న ఘటనలు తెరపైకి వస్తోన్న వేళ నితిన్ మరణానికి కూడా అదే కారణమా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తామని అన్నారు. నితిన్ కు భార్య, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు.