HCU భూములు ఎవరూ కొనొద్దు.. 3 ఏళ్ల తర్వాత లాక్కుంటాం : కేటీఆర్
గురువారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ "ఈ 400 ఎకరాల భూమి హైదరాబాద్ నగరానికి ఒక ఊపిరితిత్తుల వంటిది.
By: Tupaki Desk | 3 April 2025 8:04 AMతెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) సమీపంలోని 400 ఎకరాల భూమి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ భూమిని ఎవరైనా కొనుగోలు చేసినా, రాబోయే మూడేళ్లలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దానిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని, ఆ స్థలంలో రాష్ట్రంలోనే అతిపెద్ద పర్యావరణ పార్కును ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
గురువారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ "ఈ 400 ఎకరాల భూమి హైదరాబాద్ నగరానికి ఒక ఊపిరితిత్తుల వంటిది. పచ్చని చెట్ల కోసం విద్యార్థులు ఆందోళన చేస్తుంటే, వారిని 'గుంట నక్కలు', 'పెయిడ్ ఆర్టిస్టులు' అని ప్రభుత్వం అవమానించడం దారుణం. ఇది ప్రజాస్వామ్యమా?" అని ప్రశ్నించారు. ఐటీ అవసరాల కోసం ఈ భూమిని వేలం వేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఏప్రిల్ 3 వరకు భూమికి సంబంధించిన ఎలాంటి పనులు చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేయడంతో కేటీఆర్ వాదనకు మరింత బలం చేకూరింది.
హెచ్‌సీయూ భూముల వివాదంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ హైకోర్టు మొట్టికాయలు వేస్తున్నా ప్రభుత్వ వైఖరి మారడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అంటే యజమాని కాదని, ప్రజలకు సేవకుడని హితవు పలికారు. అర్థరాత్రి సమయంలో బుల్డోజర్లతో హెచ్‌సీయూలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే హైడ్రా విషయంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని గుర్తు చేశారు. భూముల విషయంలో విద్యార్థులను మంత్రులు చులకనగా మాట్లాడటం సరికాదని కేటీఆర్ మండిపడ్డారు. భవిష్యత్ అవసరాల కోసం 14 వేల ఎకరాల భూమి అందుబాటులో ఉండగా, హైదరాబాద్ నగరంలోని ఈ భూమిని తీసుకోవాల్సిన అవసరం ఏమిటని ఆయన నిలదీశారు. హెచ్‌సీయూలో వన్యప్రాణులు లేవని ప్రభుత్వం ఎలా చెబుతుందని కేటీఆర్ ప్రశ్నించారు. కంచె గచ్చిబౌలిలోని ఈ 400 ఎకరాల భూమిని ఎవరూ కొనవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఒకవేళ కొనుగోలు చేస్తే, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇబ్బందులు తప్పవని ఆయన హెచ్చరించారు.
మూడేళ్లలో తమ ప్రభుత్వమే వస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల విషయంలో తమ కమిట్ మెంట్ ఇదేనని ఆయన స్పష్టం చేశారు. తాము అధికారంలోకి రాగానే దానిని ఒక అద్భుతమైన ఎకో పార్క్‌గా అభివృద్ధి చేసి హెచ్‌సీయూకు కానుకగా ఇస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వానిది కేవలం రియల్ ఎస్టేట్ ఆలోచన మాత్రమేనని ఆయన విమర్శించారు. హెచ్‌సీయూ భూముల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే తాము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. ప్రభుత్వ భూములు ప్రజలందరివని, ముఖ్యమంత్రి కేవలం ధర్మకర్త మాత్రమేనని ఆయన అన్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సింది పోయి, ప్రభుత్వ పెద్దలు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే కుదరదని కేటీఆర్ హెచ్చరించారు.
-దొడ్డి కొమురయ్య స్ఫూర్తి:
తెలంగాణ ధీరుడు దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో కేటీఆర్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటానికి దొడ్డి కొమురయ్య స్ఫూర్తినిచ్చారని ఆయన కొనియాడారు. నిరంకుశత్వాన్ని ఎదిరించి పోరాడి అమరుడైన కొమురయ్య తెలంగాణ సమాజంలోని పోరాట పటిమకు నిదర్శనమని కేటీఆర్ అన్నారు. భూమి కోసం, తిండి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఆయన తన ప్రాణాలను సైతం అర్పించారని కేటీఆర్ గుర్తు చేశారు.