భారతీయుడి గుండె.. పాక్ యువతికి.. మానవత్వం అంటే ఇదే!
పాకిస్థాన్ కు చెందిన 19 ఏళ్ల రశన్ గుండె సంబంధిత సమస్యతో బాధ పడుతోంది.
By: Tupaki Desk | 25 April 2024 5:20 AM GMTహద్దులు.. అడ్డంకులు.. గోడలు మనం కట్టుకున్నవే. వాటికి అతీతంగా ఆలోచిస్తే.. నిండైన మానవత్వం ఆవిష్కరించే వీలుంది. తాజా ఉదంతం ఆ కోవలోకే. పాకిస్థాన్ కు చెందిన ఒక యువతికి భారతీయుడి గుండెను అమర్చిన ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. మానవత్వానికి ఎల్లలు లేవన్న విషయం తాజా ఉదంతంతో మరోసారి నిరూపితమైంది. తీవ్ర అనారోగ్యానికి గురైన పాక్ మహిళకు చెన్నైలోని ఒక ఆసుపత్రి వైద్యులు భారతీయుడి గుండెను అమర్చటం.. ఆ శస్త్రచికిత్స విజయవంతమైంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. సదరు వైద్యులు కానీ.. ఆసుపత్రి కానీ పాక్ యువతి నుంచి పైసా తీసుకోకపోవటం విశేషం. లక్షలాది రూపాయిలు ఖర్చుతో కూడిన ఈ శస్త్రచికిత్సను ఉచితంగా చేయటానికి కారణం సదరు ట్రస్టుగా చెబుతున్నారు. అసలేం జరిగిందంటే..
పాకిస్థాన్ కు చెందిన 19 ఏళ్ల రశన్ గుండె సంబంధిత సమస్యతో బాధ పడుతోంది. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమెకు హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ తప్పించి మరో మార్గం లేదని తేల్చేశారు. ఒకవేళ గుండెను మార్చకుంటే.. ఆమె ఊపిరితిత్తులకు సదరు వ్యాధి వ్యాపించే వీలుందని వైద్యులు పేర్కొన్నారు. శస్త్రచికిత్స చేయకుంటే.. ఎక్కువ కాలం బతికే అవకాశాన్ని కోల్పోతారని పేర్కొన్నారు. ఈ సర్జరీకి రూ.35 లక్షలు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు.
ఈ క్రమంలో తమ కుమార్తె జీవితంపై వారి తల్లిదండ్రులు తీవ్రమైన ఆందోళనకు గురయ్యారు. ఇలాంటి వేళ.. దేవుడే దిగి వచ్చినట్లుగా పేరు వెల్లడించటానికి ఇష్టపడని ఒక స్వచ్ఛంద సంస్థ బాధితురాలిని ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. భారత్ లో ఆమెకు సర్జరీ జరిగేలా ఏర్పాట్లు చేసింది. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలోని ఎంజీఎం హెల్త్ కేర్ ఆసుపత్రిలో నిపుణుల టీం యువతికి.. అవయువ దానం చేశారు. భారతీయుడి గుండెను సక్సెస్ ఫుల్ గా అమర్చారు. ప్రస్తుతం రశన్ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. తమ కుమార్తె ప్రాణాల్ని కాపాడిన సదరు ట్రస్టుకు రశన్ తల్లి తన కృతజ్ఞతలు తెలిపారు.