Begin typing your search above and press return to search.

కోస్తా కోలుకోలేదు.. ఉత్తరాంధ్ర వణికింది.. ఏపీపై వరుణ ఆగ్రహాం

వాయుగుండ ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న వాన ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   9 Sep 2024 3:58 AM GMT
కోస్తా కోలుకోలేదు.. ఉత్తరాంధ్ర వణికింది.. ఏపీపై వరుణ ఆగ్రహాం
X

దగ్గర దగ్గర పది రోజులవుతోంది. విజయవాడ ఊపిరిపీల్చుకోలేదు. వరుణుడి ఆగ్రహంతో విరుచుకుపడిన వర్షం.. దానికి తోడైన వరదముంపుతో విజయవాడ నేటికి కోలుకున్నది లేదు. ఓవైపు బాధితుల ఆర్తనాదాలు.. మరోవైపు కొనసాగుతున్న సహాయక కార్యక్రమాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. వరుణుడి ప్రతాపం ఇప్పుడు ఉత్తరాంధ్ర మీద పడింది. విజయవాడ కోలుకున్నదే లేదు.. అంతలోనే ఉత్తరాంధ్రకు వాన కష్టం వచ్చి పడింది. గడిచిన రెండు రోజులుగా కురుస్తున్న భారీ వానతో ఉత్తరాంధ్ర వణుకుతోంది.

వాయుగుండ ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న వాన ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో 10.35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా శనివారం రాత్రి నుంచి కురుస్తునన వానలతో ఉమ్మడి విజయనగరం జిల్లా రేగిడి.. రాజాం.. కొత్తవలస.. విజయనగరం.. బొబ్బిలి.. గుర్ల మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలు.. ఇళ్లు ముంపుబారిన పడ్డాయి. శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.

లావేరు మండలం బెజ్జిపురం నుంచి బుడతవలస వచ్చే రాదారి మధ్యలో సెట్టిగెడ్డలో సరుకుల వ్యాన్ కొట్టుకుపోయింది. దాన్ని ట్రాక్టర్ సాయంతో బయటకు తెచ్చే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. అతి కష్టమ్మీదా డ్రైవర్ ను మాత్రం స్థానికులు రక్షించారు. ఓవైపు విజనగరం.. శ్రీకాకుళం జిల్లాల పరిస్థితి ఇలా ఉంటే.. ఉక్కునగరం విశాఖపట్నంలో నాన్ స్టాప్ గా కురుస్తున్న వానతో గోపాలపట్నంలోని భారీ కొండచరియ విరిగి పడింది. అంతేకాదు.. జీవీఎంసీ 91వ వార్డు రామక్రిష్ణ నగర్ వద్ద దశాబ్దాల క్రితం నిర్మించిన రక్షణ గోడ ఆదివారం మధ్యాహ్నం కుప్పకూలింది. స్పందించిన అధికారులు యుద్ధ ప్రాతిపదికన సమీపంలోని ఇళ్లను ఖాళీ చేయించారు. మొత్తంగా చూస్తే ఒక కష్టం నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న వేళలో.. ఉత్తరాంధ్రలో మొదలైన వాన కష్టం ఏపీ సర్కారుకు సరికొత్త సవాలుగా మారింది.