విజయవాడలో చెరువులను తలపిస్తున్న రోడ్లు.. ప్రజలకు లోకేష్ విజ్ఞప్తి!
విజయవాడ నగరాన్ని భారీ వర్షం అతలాకుతలం చేస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పలు చోట్ల రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.
By: Tupaki Desk | 31 Aug 2024 6:51 AM GMTవిజయవాడ నగరాన్ని భారీ వర్షం అతలాకుతలం చేస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పలు చోట్ల రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాలు నీట మునిగిపోయాయి. కొండచరియలు విరిగిపడి ఇళ్లు ధ్వమంసమైపోయాయి. ఈ స్థాయిలో భారీ వర్షం బెజవాడను వణికించేస్తోంది.
అవును... ఎడతెరిపిలేని వర్షంతో విజయవాడ నగరం అతలాకుతలం అవుతోంది. ఈ క్రమంలో పలుచోట్ల రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరింది. ప్రధానంగా... ఆర్.ఆర్. నగర్, విద్యాధరపురం లో రోడ్లు జలమయయ్యాయి. దీంతో... వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇదే క్రమంలో.. విజయవాడ బస్టాండ్ పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. ఇక రామవరప్పాడు రింగ్ రోడ్డు వద్ద నిడమానూరు వరకూ భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇదే సమయంలో బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కింద భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో నేషనల్ హైవేపై వాహనాల రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది.
విరిగిపడ్డ కొండచరియలు!:
విజయవాడలో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలకు మొగల్రాజపురం సున్నపుబట్టీ సెంటర్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఓ ఇల్లు పూర్తిగా ధ్వంసమవ్వగా.. మరో మూడు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పూర్తిగా ధ్వంసమైన ఇంటిలో పలువురు చిక్కుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
ఈ ఘటనలో ఒక బాలిక మృతి చెందినట్లు తెలుస్తోంది.. పలువురికి గాయలైనట్లు సమాచారం. ఈ సమయంలో గాయపడ్డవారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అధికారులు అక్కడ సహాయక చర్యలు చేపట్టారు.
సీఎం చంద్రబాబు సమీక్ష!:
ఏపీలో ఎడతెర్పికి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వ సిబ్బంది సిద్ధంగా ఉండాలని చెప్పారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని ఆదేశించారు. మ్యాన్ హోల్స్, కరెంట్ తీగలు తెగిపడే ప్రమాదాలు జరగకుండా చూడాలని అన్నారు.
నారా లోకేష్ విజ్ఞప్తి!:
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. వరద ప్రాంతాల్లోని ప్రజలు బయటకు రావొద్దని.. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. ఈ క్రమంలో... ప్రభుత్వం, విపత్తు నిర్వహణ శాఖ ఇచ్చే అలర్ట్ మెసేజ్ లు గమనించి, తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు.