మేడారం అడవుల్లో సుడిగాలుల బీభత్సం.. వన్యప్రాణులు ముందే పసిగట్టాయా..?
ఓ వైపు వర్షాలు.. మరోవైపు వరదలు.. ఇటీవల తెలంగాణను వణికించాయి. పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది.
By: Tupaki Desk | 18 Sep 2024 11:30 AM GMTఓ వైపు వర్షాలు.. మరోవైపు వరదలు.. ఇటీవల తెలంగాణను వణికించాయి. పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలు తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. ఇటు వానలు, వరదలు ప్రజలను, అధికార యంత్రాంగాన్ని కష్టాల పాలు చేస్తుంటే ఇదే క్రమంలో.. మేడారం అడవుల్లో సుడిగాలులు బీభత్సం సృష్టించాయి.
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అడవుల్లో టోర్నడోలు వచ్చినట్లుగా ఒక్కసారిగా సుడిగాలులు రెచ్చిపోయాయి. సుమారు 50వేల చెట్లు నెలకొరిగాయి. 200 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ అడవుల్లో పెద్ద ఎత్తున గాలిదుమారం బీభత్సం సృష్టించింది. దీంతో మహావృక్షాలు సైతం మొక్కల్లా నేలకొరిగాయి. పరిశీలనకు వెళ్లిన అధికారులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. పెద్ద ఎత్తున వాటిల్లిన భయోత్పాతాన్ని లెక్కించే పనిలో నిమగ్నం అయ్యారు. ఆ లెక్క ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
పెద్ద పెద్ద వృక్షాలు నేలకొరిగాయి అంటే కనీసం గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులే దీనికి కారణమంటూ అటవీ శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే.. ఒకేసారి 50వేలకు పైగా చెట్లు నేలకొరగడంపైనా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదిలా ఉంటే.. ఇంతటి పెను గాలులతో అడవిలో అంతలా బీభత్సం నెలకొంటే వన్యప్రాణులు మాత్రం సేఫ్ అయ్యాయి. ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రాణాలు కోల్పోయిన దాఖలాలు లేవు. కనీసం గాయపడినట్లుగానూ ఎక్కడా కనిపించలేదు. ఈ అడవిలో జింకలు, ఎలుగుబంట్లు, కుందేళ్లు, అడవి దున్నలు, నీలుగాయిలు, కొండ గొర్రెలు, అడవి పందులు, కోతులు, ఉడుతలు, వివిధ రకాల పక్షులు ఇతర జీవరాశులు చాలా వరకే ఉన్నాయి. వేల సంఖ్యలో వన్యప్రాణులు ఉన్నాయి.
అయితే.. సుడిగాలులు ఇంతలా అడవులను నేలమట్టం చేసినా వన్యప్రాణులు చనిపోయినట్లుగా ఇంతవరకు అధికారులకు కనిపించలేదు. దీంతో అధికారులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే.. దీనిపైనా ఓ రకమైన ప్రచారం జరుగుతోంది. సాధారణంగా వన్యప్రాణులకు ప్రకృతి విపత్తులను ముందుగానే పసిగట్టే గుణం ఉంటుంది. వాసన, శబ్దాలను అవి ఇట్టే గుర్తిస్తాయి. భూ ప్రకంపనలను సైతం ముందు పసిగడతాయి. అయితే.. ఆ రోజు కూడా ఈ విపత్తును ముందే పసిగట్టి అవి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లి ఉంటాయని భూపలపల్లి అటవీ శాఖ రిటైర్డ్ అధికారి పురుషోత్తం తెలిపారు.