ఎంపీ సీట్లకు హెవీ డిమాండ్.. కీలక నేతల దరఖాస్తు!
ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని రాష్ట్ర పార్టీ కార్యాలయం గాంధీభవన్ కు పెద్ద ఎత్తున నేతలు తరలివచ్చి దరఖాస్తులు ఇచ్చారు.
By: Tupaki Desk | 1 Feb 2024 5:57 AM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలపై దృష్టి సారించింది. తెలంగాణలో మొత్తం 17 లోక్ సభా స్థానాలు ఉండగా.. వీటిలో అత్యధిక స్థానాల్లో గెలుపు బావుటా ఎగురవేయాలని కృతనిశ్చయంతో ఉంది. ఈ క్రమంలో ఎంపీ సీట్లకు పోటీ చేయాలనుకునే ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని రాష్ట్ర పార్టీ కార్యాలయం గాంధీభవన్ కు పెద్ద ఎత్తున నేతలు తరలివచ్చి దరఖాస్తులు ఇచ్చారు.
ఎంపీ సీట్లకు దరఖాస్తు చేసినవారిలో తీన్మార్ మల్లన్న, మల్లు రవి, కైలాష్ నేత, చందా లింగయ్య, ఆనంద్ కుమార్ దరఖాస్తులు దాఖలు చేశారు. వీరిలో తీన్మార్ మల్లన్న, కైలాష్ నేత భువనగిరి ఎంపీ స్థానానికి దరఖాస్తు ఇచ్చారు. నాగర్ కర్నూలు సీటుకు మాజీ ఎంపీ మల్లు రవి, ఆయన కుమారుడు సిద్ధార్థ్ దరఖాస్తు చేశారు. అలాగే వీరితోపాటు చారకొండ వెంకటేశ్ కూడా దరఖాస్తు చేసుకున్నారు.
మహబూబాబాద్ స్థానానికి చందా లింగయ్య, వరంగల్ సీటుకు ఆనంద్ కుమార్ దరఖాస్తు చేశారు. అలాగే మల్కాజిగిరి స్థానానికి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం మీద తొలి రోజు ఎనిమిది దరఖాస్తులు వచ్చినట్టు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
కాగా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఓటమి పాలైన అభ్యర్థులతో పాటు అవకాశం చిక్కని అభ్యర్థులు కూడా లోక్ సభ స్థానాల్లో పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లోక్ సభ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఓట్ల శాతం కూడా పెరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం అధికార బలం కూడా ఉండటంతో ఎన్నికల్లో పోటీ చేసే తమకు కలిసి వస్తోందని ఆశావాహులు భావిస్తున్నారు. దీంతో ఎంపీ సీట్లకు గతంలో ఎన్నడూ లేనంతగా డిమాండ్ ఏర్పడింది.
కాగా హైదరాబాద్ నుంచి పోటీ చేసేందుకు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఫిరోజ్ ఖాన్ తోపాటు డీసీసీ అధ్యక్షుడు సమీర్ వలీవుల్లా సిద్ధమవుతున్నారు. సికింద్రాబాద్ నుంచి అక్కడి డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది.
2014, 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి వివిధ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతం గణనీయంగా పెరిగిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి పెద్ద ఎత్తున ఆశావహులు సిద్ధమవుతున్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మరికొద్ది రోజులు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఒక్కో సీటుకు పోటీ చేసేవారి సంఖ్య భారీగానే ఉంటుందని అంటున్నారు.
ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ, భువనగిరి, మల్కాజిరిగి, చేవెళ్ల తదితర స్థానాలకు సీటు ఆశించేవారి శాతం ఎక్కువ ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.