Begin typing your search above and press return to search.

ఆ కాళరాత్రి.. హిమాచల్ కుంభవృష్టిలో ఊరికి ఊరే గల్లంతు.. ఆ ఇల్లే మిగిలింది

By:  Tupaki Desk   |   3 Aug 2024 10:30 AM GMT
ఆ కాళరాత్రి.. హిమాచల్ కుంభవృష్టిలో ఊరికి ఊరే గల్లంతు.. ఆ ఇల్లే మిగిలింది
X

ఒక్క రాత్రిలో.. ఓకే ఒక్క కాళరాత్రి.. అప్పటివరకు మనది అనుకున్న ఊరు అక్కడ లేదు.. మనవి అనుకున్న జంతుజాలం కొట్టుకుపోయాయి.. అయినవారు అందరూ గల్లంతయ్యారు.. అసలక్కడ ఊరే లేదు.. ఒక్క ఇల్లు తప్ప.. ఇదీ హిమాచల్ ప్రదేశ్ లో బుధవారం అర్థరాత్రి సంభవించిన మెరుపు వరదల తాలూకు బీభత్సం.. ఒక్క రోజులోనే 20 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిస్తే.. అందులోనూ హిమాచల్ వంటి కొండ ప్రాంతాలు అధికంగా ఉండే రాష్ట్రంలో జరిగితే..? ఏమవుతుందో తెలియజెప్పే ఉదంతం ఇది.

ప్రఖ్యాత హిల్ స్టేషన్లయిన హిమాచల్‌ లోని శిమ్లా, కులుతో పాటు మండి, రాంపూర్ ప్రాంతాల్లో బుధవారం అర్థరాత్రి గంటల వ్యవధిలో వరద ముంచెత్తింది. మెరుపు వరద కారణంగా శిమ్లా జిల్లా రాంపూర్‌ లోని సమేజ్ ఖడ్‌ తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ గ్రామంలో ఒక్క ఇల్లు మాత్రమే మిగిలిందంటే విషాదం అర్థం చేసుకోవచ్చు. అనితాదేవి అనే మహిళకు చెందిన ఆ ఇల్లు బతికి బట్టకట్టింది. వరద ముంచెత్తినప్పుడు తామంతా గాఢ నిద్రలో ఉన్నామని, లేచి చూసేసరికి ఊరిలో ఏమీ లేదని ఆమె వాపోయింది. అప్పటికీ పెద్ద శబ్దంతో తమ ఇల్లు దద్దరిల్లిందని.. బయటకు వచ్చి చూస్తే అంతా నీరే ఉందని.. ఊరంతా కొట్టుకుపోయిదని తెలిపింది. కాళీమాత ఆలయంలో తలదాచుకున్నట్లు చెప్పింది.

14 మంది కుటుంబ సభ్యులను కోల్పోయి

సమేజ్ ఖడ్ కే చెందిన బఖ్షి రామ్‌ 14 మంది కుటుంబ సభ్యులు వరదలో కొట్టుకుపోయారు. ఆమె రాంపూర్‌లో ఉండడంతో ప్రాణాలు దక్కాయని తెలిపింది. కొట్టుకుపోయిన తనవారి కోసం ఆమె మూడు రోజులుగా వెదుకులాడుతోంది. కాగా, హిమాచల్ లోని మూడు జిల్లాలకు వాతావరణ శాఖ అతి భారీ వర్షాల హెచ్చరిక రెడ్ అలర్ట్ జారీ చేసింది. పలు ప్రాంతాల్లో 50 మంది వరకు గల్లంతయ్యారు. 8 మంది చనిపోయారు. 60పైగా ఇళ్లు కొట్టుకుపోయాయి. సమేజ్‌ ఖడ్ కు వెళ్లేందుకు రోడ్లే లేవు. హిమాచల్ తో పాటు ఉత్తరాఖండ్‌ లోనూ వర్షం బీభత్సం రేపింది. ప్రసిద్ధ పుణ్య క్షేత్రం కేదార్‌ నాథ్‌ వెళ్లే మార్గంలో వేలాది యాత్రికులు చిక్కుకున్నారు. చినూక్, ఎం17 హెలికాప్టర్ల ద్వారా వీరిని రక్షిస్తున్నారు.