ఆయనే కోట్లు పంచుతున్నాడు.. కాదు ఆయనే పంచుతున్నాడు!
ఆయన కోట్ల రూపాయలు పంచుతున్నాడని.. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి ప్రచారంలో చెబుతుంటే.. ఇటు వైపు నుంచి కూడా అంతే రేంజ్‌లో విమర్శలు వస్తున్నాయి.
By: Tupaki Desk | 24 Nov 2023 5:15 AM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నోట్ల పంపకాల విషయం హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు కేంద్ర ఎన్నికల సంఘం నిగా కొనసాగుతుండగానే.. మరోవైపు పోలీసులు కూడా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అయి నా కూడా.. పంపిణీ మాత్రం చాపకింద నీరులా సాగిపోతోందనేది నిష్టుర సత్యం. అయితే.. దీనిపై ప్రధాన పార్టీల ప్రత్యర్థుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో విరుచుకుపడుతున్నారు.
ఆయన కోట్ల రూపాయలు పంచుతున్నాడని.. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి ప్రచారంలో చెబుతుంటే.. ఇటు వైపు నుంచి కూడా అంతే రేంజ్‌లో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, పాలేరు నియోజకవ ర్గాలు సహా ఎల్బీనగర్, కోదాడ, సాగర్ నియోజకవర్గాల్లో ఈ తరహా ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్లు.. ఎక్కువగా డబ్బులు పంచుతున్నారని.. బీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులు చెబుతున్నారు. అయితే.. బీఆర్ ఎస్ అభ్యర్థులే బాగా బలిశారని.. కేసీఆర్ ఇచ్చిన అవినీతి సొమ్మును ప్రజలకు పంచుతున్నారని కాంగ్రెస్‌నేతలు ఎదురు దాడి చేస్తున్నారు.
ఒక, కొందరు తమకు కోట్లు పెట్టి ఓట్లు కొనాల్సిన అవసరం లేదని.. తమకు ప్రజలు అండగా ఉన్నారని చెబుతున్నారు. కానీ, లోపాయికారీగా గ్రామీణ స్థాయిలో పంపకాలు జరిగిపోతున్నాయి. ఇక, కొందరైతే.. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని చెబుతున్నారు. కానీ, ఆ ఆధారాలను మాత్రం ఎవరూ బయటకు పెట్టడం లేదు. దీనికి కారణం.. ఎదుటి పక్షం వద్ద తమ ఆధారాలు కూడా ఉండడమే. అంటే మొత్తంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారే తప్ప..ఎవరూ బయటకు రావడం లేదు.
ఖమ్మం విషయానికి వస్తే.. తుమ్మల నాగేశ్వరరావు.. డబ్బులు పంచుతున్నాడని.. మంత్రి పువ్వాడ అజయ్ ఆరోపించారు. ఇదే సమయంలో పువ్వాడ కాలేజీలు.. డబ్బుల పంపిణీకి అడ్డాలుగా మారాయని తుమ్మల నిప్పులు చెరిగారు. అయితే.. వీరిద్దరూ కూడా డబ్బులు పంచుతున్నారని కమ్యూనిస్టులు ఆరోపిస్తున్నారు. మొత్తంగా.. ఆయన కోట్లు పంచుతున్నారని ఈయన.. కాదు.. ఈయనే కొట్లు పంచుతున్నారని ఆయన ఇరు పక్షాల మధ్య పంపకాలపై కామెంట్ల యుద్దం జరుగుతుండడం గమనార్హం.