వీడ్నేం చేయాలి? అన్నంలోకి పచ్చడి అని చెప్పి.. బుగ్గ కొరికేశాడు!
అన్నంలోకి పచ్చడి కావాలంటూ కోరిన వ్యక్తి అభ్యర్థనను మన్నించిన మహిళకు చేదు అనుభవం ఎదురైంది.
By: Tupaki Desk | 19 Dec 2023 11:30 AM GMTమంచికి పోతే చెడు ఎదురైందంటారు. తాజా ఉదంతం గురించి తెలిస్తే ఇదే మాట చప్పున గుర్తుకు రావటం ఖాయం. అవసరం కోసం అడిగాడన్న మంచితనానికి పోతే.. మొదటికే మోసం వచ్చినట్లుగా చోటు చేసుకున్న ఉదంతంగాదీన్ని చెప్పాలి. అన్నంలోకి పచ్చడి కావాలంటూ కోరిన వ్యక్తి అభ్యర్థనను మన్నించిన మహిళకు చేదు అనుభవం ఎదురైంది. కర్ణాటకలో చోటు చేసుకున్న ఈ షాకింగ్ ఉదంతంలోకి వెళితే..
కర్ణాటకలోని దావణగెరె శివారుకు చెందిన 48 ఏళ్ల మంజప్ప ఒక మహిళ ఇంటి తలుపు తట్టాడు. అన్నం తినేందుకు అందులోకి కాస్తంత పచ్చడి ఇవ్వాలని అభ్యర్థించాడు. అందుకు అయ్యో.. అన్న మంచితనంతో పచ్చడి ఇద్దామనుకున్న ఆమె బుగ్గను కొరకటమే కాదు.. ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడిన వైనంతో హడలిపోయిన ఆమె.. పెద్ద ఎత్తున కేకలు వేసింది.
ఈ తరహాలో దావణెగెరె చుట్టుపక్కల ప్రాంతాల్లో పలువురు మహిళలపట్ల ఇదే రీతిలో వ్యవహరించాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి ఉన్మాదిని కఠినంగా శిక్షించాలని స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉదంతం గురించి సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ వెంటనే స్పందించారు. బాధితురాలి గ్రామానికి వచ్చి.. ఆమెను పరామర్శించారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకునేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో..అక్కడి స్థానికులు శాంతించారు.