Begin typing your search above and press return to search.

హేలాపురి బరిలో ఎంపీ అభ్యర్థి ఆయనేనా?

ఈ క్రమంలో టీడీపీ తరఫున బోళ్ల బుల్లిరామయ్య నాలుగుసార్లు ఎంపీగా గెలుపొందారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ తరఫున కావూరి సాంబశివరావు రెండుసార్లు విజయం సాధించారు.

By:  Tupaki Desk   |   12 Jan 2024 6:54 AM GMT
హేలాపురి బరిలో ఎంపీ అభ్యర్థి ఆయనేనా?
X

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఏలూరు లోక్‌ సభా నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ నుంచి 1989లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున సూపర్‌ స్టార్‌ కృష్ణ ఎంపీగా విజయం సాధించారు. వేంగి చాళుక్యల కాలంలో హేలాపురిగా ఏలూరు గొప్ప ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు అత్యధిక సార్లు వివిధ పార్టీల తరఫున కమ్మ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులే విజయం సాధించారు.

ఈ క్రమంలో టీడీపీ తరఫున బోళ్ల బుల్లిరామయ్య నాలుగుసార్లు ఎంపీగా గెలుపొందారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ తరఫున కావూరి సాంబశివరావు రెండుసార్లు విజయం సాధించారు. అటు బోళ్ల బుల్లిరామయ్య, ఇటు కావూరి సాంబశివరావు కేంద్రంలో మంత్రులుగా కూడా పనిచేయడం విశేషం.

కాగా 2014 వరకు కమ్మ అభ్యర్థులే ఏలూరు లోక్‌ సభా నియోజకవర్గంలో గెలుస్తూ వస్తున్నారు. 2019లో దీనికి బ్రేక్‌ పడింది. ఆ ఎన్నికల్లో వైసీపీకి చెందిన వెలమ అభ్యర్థి కోటగిరి శ్రీధర్‌ విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో కోటగిరి శ్రీధర్‌ మరోమారు ఎంపీగా పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదని టాక్‌ నడుస్తోంది. ఆయన అసెంబ్లీకి పోటీ చేయాలని కోరుకుంటున్నారని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఏలూరు లోక్‌ సభా నియోజకవర్గం అభ్యర్థికి ఈసారి వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. బీసీ అభ్యర్థికి సీటు ఇచ్చారు. ప్రస్తుతం తణుకు ఎమ్మెల్యేగా, పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్‌ కుమార్‌ కు సీటు కేటాయించారు.

ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో ఏలూరు ఎంపీగా వైసీపీ తరఫున కారుమూరి సునీల్‌ పోటీ చేస్తారని చెబుతున్నారు. లేదంటే చివర క్షణంలో ఇందులో మార్పులుచేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని టాక్‌ నడుస్తోంది.

ఒకవేళ ఏలూరు ఎంపీగా సునీల్‌ కుమార్‌ పోటీ చేసే పక్షంలో ఆయన తండ్రి, ప్రస్తుతం మంత్రిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావుకు తణుకులో సీటు ఇస్తారా, లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఏలూరును సునీల్‌ కు కేటాయిస్తే తణుకులో కారుమూరికి సీటు ఇవ్వకపోచ్చని ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యేగా ఉన్న యాదవ సామాజికవర్గానికి చెందిన కొలుసు పార్థసారధికి వచ్చే ఎన్నికల్లో జగన్‌ సీటు కేటాయించలేదు. ఈ సీటును మంత్రి జోగి రమేష్‌ కు కేటాయించారు. ఈ నేపథ్యంలో బలమైన యాదవ సామాజికవర్గానికి ఆగ్రహం రాకుండా ఉండేందుకే ఏలూరు ఎంపీ సీటును యాదవ సామాజికవర్గానికి చెందిన కారుమూరి సునీల్‌ కు ప్రకటించారని టాక్‌ నడుస్తోంది.