Begin typing your search above and press return to search.

చంద్రబాబు కోసం తెప్పిస్తున్న హెలికాఫ్టర్ క్రాష్? నిజమెంత?

నిజంగానే చంద్రబాబు కోసం హడావుడి ఒక హెలికాఫ్టర్ ను తెప్పిస్తున్నారా? అన్నది మరో చర్చగా మారింది.

By:  Tupaki Desk   |   25 Aug 2024 4:36 AM GMT
చంద్రబాబు కోసం తెప్పిస్తున్న హెలికాఫ్టర్ క్రాష్? నిజమెంత?
X

నిన్నటి నుంచి కొన్ని మీడియా సంస్థలకు చెందిన వేదికల మీద ఒక వార్త హడావుడి చేస్తోంది. దాని సారాంశాన్ని సింఫఉల్ గా ఒక్క లైన్ లో చెప్పాలంటే.. ‘ఏపీ సీఎం చంద్రబాబు కోసం ముంబయి నుంచి తెప్పిస్తున్న హెలికాఫ్టర్ క్రాష్ అయ్యింది’ అని. ఇందులో వాస్తవం ఎంతన్నది పక్కన పెడితే.. చంద్రబాబు కోసం తెప్పిస్తున్నారన్న మాటతో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. నిజంగానే చంద్రబాబు కోసం హడావుడిగా ఒక హెలికాఫ్టర్ ను తెప్పిస్తున్నారా? అన్నది మరో చర్చగా మారింది. అసలేం జరిగిందన్నది చూస్తే..

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం ముంబయి నుంచి హెలికాఫ్టర్ తెప్పిస్తున్నారా? లేదా? అన్నది ప్రచారంలో నిజం లేదని చెబుతున్నారు. అయితే.. ముంబయిలోని జుహు నుంచి బయలుదేరిన ఎడబ్ల్యూ 139 అనే చాపర్ ఫూణె కు సమీపంలోని పౌడ్ అనే ప్రాంతంలో కూలిపోయింది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవటంతోనే ఇలా జరిగినట్లు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వేళలో హెలికాఫ్టర్ లో కెప్టెన్ తో సహా నలుగురు ఉన్నారు. లక్కీగా అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. కాకుంటే.. పైలెట్ కెప్టెన్ ఆనంద్ కు మాత్రం తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. అతన్ని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని ఎస్పీ పంకజ్ దేశ్ ముఖ్ వెల్లడించారు.

ముంబయి నుంచి హైదరాబాద్ కు వస్తుండగా ఈ ఘటన జరిగినట్లుగా చెబుతున్నారు. భారీ వర్షాలు.. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనే ఈ పరిణామం చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. ఫూణె సమీపానికి వచ్చేసరికి అక్కడ భారీ వర్షం కురుస్తోందని.. ఈ కారణంగానే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో హెలికాఫ్టర్ ధ్వంసమైంది. అయితే.. దీన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం హడావుడిగా తెప్పించినట్లుగా ప్రచారం జరుగుతోంది.

ఈ ప్రచారంలో నమ్మలేని నిజం ఏమంటే.. చంద్రబాబు ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి. ఒక రాష్ట్ర సీఎం కోసం ప్రభుత్వ పరంగా హెలికాఫ్టర్ సిద్ధంగా ఉంటుంది. అలాంటప్పుడు ఒక ప్రైవేటు హెలికాఫ్టర్ ను తెప్పించాల్సిన అవసరం లేదన్న విషయాన్ని చాలా మంది ప్రస్తావిస్తున్నారు. ఇదే సమయంలో ఏవియేషన్ కో ఆర్డినేటింగ్ అధికారి హెలికాఫ్టర్ ను రప్పించే ప్రయత్నాలు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.

ఇదే సమయంలో హెలికాఫ్టర్ ను విజయవాడకు రప్పించే ప్రయత్నం చేశారన్న వాదనకు భిన్నంగా.. మహారాష్ట్ర పోలీసు అధికారులు మొదలు.. సదరు హెలికాఫ్టర్ కు సంబంధించిన వారంతా తాము హైదరాబాద్ కు వెళుతున్నట్లుగా పేర్కొన్నారు. మొత్తంగా అక్కడెక్కడో మహారాష్ట్రలో జరిగిన ఒక హెలికాఫ్టర్ ప్రమాదం సీఎం చంద్రబాబు ఖాతాలో వేస్తుండటం పై విస్మయం వ్యక్తమవుతోంది. సంచలన అంశం ఏదైనా చోటు చేసుకుంటే.. ఏదో ఒక లెక్కలో చంద్రబాబు ఖాతాలో వేయాలన్న తపనపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ఎపిసోడ్ కు సంబంధించి మరెన్ని అంశాలు వెలుగు చూస్తాయో చూడాలి.