సూపర్ పవర్ అమెరికా కళ్లుచెదిరే లేజర్ పవర్ చూశారా..
ఇప్పుడు ఆ దేశానికి చెందిన నౌకా దళ లేజర్ శక్తికి సంబంధించిన ఓ ఫొటో వైరల్ అవుతోంది.
By: Tupaki Desk | 5 Feb 2025 3:30 PM GMTఈ భూమ్మీద సూపర్ పవర్ అంటే అమెరికానే.. మరి ఆ దేశానికి చెందిన సైనిక, వైమానిక, నౌకా దళ సామర్థ్యాలను మనం కళ్లారా చూశాం. అఫ్ఘానిస్థాన్ పై యుద్ధం చేసినప్పుడు.. పాకిస్థాన్ లో నక్కిన అంతర్జాతీయ ఉగ్రవాది బిన్ లాడెన్ ను హతమార్చిన సందర్భంలో.. ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ను వెంటాడిన సమయంలో.. అమెరికా సత్తా ఏమిటో ప్రపంచం అంతా చూసింది. ఇప్పుడు ఆ దేశానికి చెందిన నౌకా దళ లేజర్ శక్తికి సంబంధించిన ఓ ఫొటో వైరల్ అవుతోంది.
యునైటెడ్ కింగ్ డమ్ ఇటీవల ‘డ్రాగన్ ఫైర్’ అంటూ సొంతంగా లేజర్ ఆయుధాన్ని పరీక్షించింది. ఆకాశంలో దూసుకొచ్చే లక్ష్యాలను ఛేదించింది కూడా. దీంతో తమ మిత్రదేశమే అయినప్పటికీ యూకేకు తామేమీ తగ్గం అన్నట్లుగా అమెరికా హేలియోస్ అనే ఆయుధ వ్యవస్థను పరీక్షించింది.
అమెరికా డెస్ట్రాయర్ యూఎస్‌ఎస్ ప్రిబుల్ డెస్ట్రాయర్ సముద్రం మధ్యలో హేలియోస్ ను ప్రయోగిస్తున్న ఫొటో వైరల్ అవుతోంది. దీనిని యూఎస్ సెంటర్ ఫర్ కౌంటర్ మెజర్స్ సంవత్సర నివేదికలో ఫిబ్రవరిలో ప్రచురించారు.
హేలియోస్.. సామర్థ్యం.. శక్తి ఎలాంటిదో పరీక్షిస్తున్న ఫొటోనే విడుదల చేసినట్లుగా భావిస్తున్నారు. దీనికి హైఎనర్జీ లేజర్ సామర్థ్యం ఉందని మాత్రమే చెప్పారు. ఇతర వివరాలు వెల్లడించలేదు.
హై ఎనర్జీ లేజర్ ఇంటిగ్రేటెడ్ ఆప్టికల్ డాజ్‌లర్ అండ్ సర్వైలెన్స్ కు షార్ట్ ఫామే హేలియోస్. 60 కిలో వాట్ హైఎండ్ ఎనర్జీ లేజర్ కాంతి వేగంతో టార్గెట్లపై దాడి చేయగల దీనిని ప్రపంచ దిగ్గజ సంస్థ లాక్ హీడ్ మార్టిన్ దీనిని అభివృద్ధి చేసింది. పైగా వివిధ దశల్లో రక్షణ వ్యవస్థలా పనిచేస్తుందట.
రెండు విధాలుగా విధ్వంసం
హార్డ్ కిల్.. అంటే శత్రు లక్ష్యాలను భౌతికంగా నిర్మూలించడం.., సాఫ్ట్ కిల్.. టార్గెట్ కమ్యూనికేషన్లను తెంపేయడం.. ఈ రెండు పనులు చేస్తుంది హేలియోస్. అంతేకాదు.. ఇంత భారీ ఆయుధం వాడకమూ చాలా సులువట. ఇజ్రాయెల్, యూకే, దక్షిణ కొరియా, తుర్కియే, జర్మనీ, జపాన్ లేజర్ ఆయుధాలను అభివృద్ధి చేశాయి.
ఉత్తర కొరియా డ్రోన్ల దండును కూల్చేందుకు స్టార్ వార్స్ ప్రాజెక్ట్ అనే పేరు పెట్టి తయారీకి పూనుకుంది దక్షిణ కొరియా.
ఆయుధ టెక్నాలజీలో ఎప్పుడూ ముందుండే ఇజ్రాయెల్ సంగతి చెప్పేదేముంది. ఐరన్ డోమ్ పేరిట క్షిపణి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లే ఐరన్ బీమ్ పేరిట లేజర్ ఆయుధాన్ని అభివద్ధి చేసింది. ఒక్కసారి ప్రయోగించి రెండు డాలర్ల వ్యయంతో రాకెట్లను కూల్చేయొచ్చని ప్రకటించింది.