జగన్ ఇంటి ముందు నిర్మాణాలు కూల్చివేత... అధికారిపై వేటు!
ఖైరతాబాద్ జోన్ కమిషనర్ గా ఉన్న హేమంత్ బోర్కడే ఆదేశాలతో ఈ కూల్చివేత కార్యక్రమాలు జరిగాయని అంటున్నారు.
By: Tupaki Desk | 16 Jun 2024 11:30 PM GMTఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంటిముందు గల నిర్మాణాలను జీ.హెచ్.ఎం.సీ. అధికారుల ఆదేశల మేరకు సిబ్బంది కూల్చివేశారనే విషయం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఇవి అక్రమ నిర్మాణాలని చెబుతూ వీటిని కూల్చివేశారు. ఖైరతాబాద్ జోన్ కమిషనర్ గా ఉన్న హేమంత్ బోర్కడే ఆదేశాలతో ఈ కూల్చివేత కార్యక్రమాలు జరిగాయని అంటున్నారు. ఇక్కడే ఒక ట్విస్ట్ తెరపైకి వచ్చింది.
అవును... కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంటి ముందు ఉన్న పోలీస్ సెక్యూరిటీ నిర్మాణాలు అక్రమం అయినవంటూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చి వేసిన సంగతి తెలిసిందే. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడే ఆదేశాలతో కూల్చివేత ప్రక్రియ జరిగిందని చెబుతున్నారు.
ఇదే సమయంలో తెలంగాణ కు చెందిన ఓ మంత్రి ఈ విషయంలో స్వయంగా కల్పించుకుని హేమంత్ కు ఆదేశాలు జారీచేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో హేమంత్ రంగంలోకి దిగారని అంటున్నారు. ఏది ఏమైనా.. లోటస్ పాండ్ లో జగన్ ఇంటి ముందు పోలీస్ సెక్యూరిటీ నిర్మాణాలు కూల్చివేయడంతో ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వైరల్ గా మారింది. రాజకీయంగా ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.
ఈ నేపథ్యంలో జీ.హెచ్.ఎం.సీ కమిషనర్ అమ్రపాలి స్వయంగా రంగంలోకి దిగి ఈ విషయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారని అంటున్నారు. దీంతో... ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడే సొంతంగా నిర్ణయం తీసుకున్నారని తెలిసిందని కథనాలు వస్తున్నాయి. దీంతో... హేమంత్ ను ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ పదవి నుంచి బదిలీ చేస్తూ.. జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆమ్రపాలి ఆదేశాలు జారీచేశారని తెలుస్తుంది.