మోడీ జై కొట్టారు.. ఈడీ ఆగింది-ఇండియాలో చేరారు.. ఈడీ కదిలింది!
ఇక, ఇటీవల మనసు మార్చుకున్న హేమంత్ సోరెన్ విపక్ష కూటమి ఇండియాలో భాగస్వామిగా చేరారు
By: Tupaki Desk | 9 Aug 2023 4:49 AM GMTఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ప్రాంతీయపార్టీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే.. ఆయనపై కొన్ని భూముల కుంభకోణం కేసులు, మనీలాండరింగ్ కేసులు ఉన్నాయి. అదేం చిత్రమో కానీ.. వీటిని విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) అధికారు లు.. ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి.. అచ్చం మన ఇళ్లలో ఉండే 'కీ బొమ్మల' టైపులో వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కొన్నాళ్ల కిందట.. సదరు సీఎం బీజేపీకి, కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుకు జై కొట్టారు. అంతే.. అక్కడి దాకావచ్చిన ఈడీ వెనక్కి తగ్గింది!
కట్ చేస్తే.. సదరు ముఖ్యమంత్రి ఆరు మాసాల వ్యవధిలో మనసు మార్చుకున్నారు. మోడీని కాదని కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి జై కొట్టారు. ఇది జరిగి నెల రోజులు కూడా కాక ముందే.. తాజాగా ఆయనకు ఈడీ ''వచ్చేయండి.. విచారించుకుందాం!'' అని నోటీసులు పంపించేసింది.
బీజేపీకి జై కొట్టినప్పుడు వెనక్కి తగ్గిన ఈడీ.. ఇండియాతో చేతులు కలపగానే ముందుకు రావడం ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ విషయం..జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, యువ నాయకుడు జేఎంఎం(జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ) అధినేత హేమంత్ సొరేన్‌కు తాజాగా ఈడీ సమన్లు పంపింది. ఈ నెల 14న(స్వాతంత్ర దినోత్సవానికి ముందు రోజు) విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద వాంగ్మూలం ఇచ్చేందుకు జార్ఖాండ్ రాజధాని రాంచీలో వచ్చే వారం అందుబాటులో ఉండాలని హేమంత్ సోరెన్‌ను కోరింది. అక్రమ మైనింగ్ కేసులో సోరెన్‌ను గతంలోనూ ఈడీ ప్రశ్నించింది. అయితే.. ఆయన బీజేపీకి జై కొట్టగానే వెనక్కి తగ్గిపోయింది.
ఇక, ఇటీవల మనసు మార్చుకున్న హేమంత్ సోరెన్ విపక్ష కూటమి ఇండియాలో భాగస్వామిగా చేరారు. అంతేకాదు.. గత నెలలో బెంగళూరులో జరిగిన సమావేశానికి కూడా హాజరయ్యారు. అంతే.. వచ్చేయండి.. అంటూ ఈడీ పిలిచింది. దీనిపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.