Begin typing your search above and press return to search.

ఏపీలో కొత్త వ్యాధి... సికిల్‌ హిమోగ్లోబిన్‌ డి-పంజాబ్‌!

ప్రస్తుతం ఏపీలో పోలింగ్ కి ఫలితాలకి మధ్య ఉన్న హాట్ క్లైమేట్ నెలకొన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   28 May 2024 6:12 AM GMT
ఏపీలో కొత్త వ్యాధి... సికిల్‌  హిమోగ్లోబిన్‌  డి-పంజాబ్‌!
X

ప్రస్తుతం ఏపీలో పోలింగ్ కి ఫలితాలకి మధ్య ఉన్న హాట్ క్లైమేట్ నెలకొన్న సంగతి తెలిసిందే. ఇక పోలింగ్ రోజు నుంచి రాజకీయ ఘర్షణలతో అల్లాడిపోయిన పల్నాడు వాసులకు తాజాగా మరో కష్టం వచ్చింది. ఎక్కడో నార్త్ లో అత్యంత అరుదుగా కనిపించే వ్యాధి ఇప్పుడు పల్నాడులో వెలుగులోకి వచ్చింది. దీంతో... ఏపీవాసులను ఈ వ్యాధి ఇప్పుడు కలవరపెడుతుందని అంటున్నారు!

అవును... పంజాబ్‌ లో మాత్రమే కనిపించే ఓ అరుదైన వ్యాధి తాజాగా ఏపీలోని పల్నాడులో దర్శనమిచ్చింది. దీంతో ఈ వ్యవహారం రాష్ట్రంలో కలకలం రేపుతోంది! సికిల్‌ హిమోగ్లోబిన్‌ డి-పంజాబ్‌ అనే ఈ వ్యాధిని పల్నాడు జిల్లాకు చెందిన ఇద్దరు చిన్నారుల్లో గుర్తించినట్లు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కిరణ్‌ కుమార్‌ తెలిపారు. దీనికి సంబంధించిన విషయాలు మీడియాకు వెళ్లడించారు.

తాజాగా ఈ వ్యాదికి సంబంధించిన విషయాలను వెల్లడించిన గుంటూరు గవర్నమెంట్ హాస్పటల్ సూపరింటెండెంట్... పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పలపాడు శివారు శ్రీరాంపురంతండా నుంచి ఇటీవల ఇద్దరు పిల్లలు రక్తహీనత (ఎనీమియా) సమస్యతో ఆసుపత్రికి వచ్చారని తెలిపారు. ఈ సమయంలో... వారికి రక్తపరీక్ష చేయగా.. వారు సికిల్‌ హిమోగ్లోబిన్‌ డి-పంజాబ్‌ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారని తెలిపారు.

ఈ వ్యాది చాలా అరుదుగుగా వస్తుందని.. ఇలా చాలా అరుదైన ఈ సమస్యకు ఎముక మజ్జ మార్పిడి చికిత్స ఒక్కటే సరైన పరిష్కారమని తెలిపారు. అయితే ప్రస్తుతం ఈ చికిత్స ప్రభుత్వాసుపత్రిలో అందుబాటులో లేదని తెలిపిన ఆయన... తాత్కాలికంగా దాతల రక్తం నుంచి ఎర్ర రక్త కణాలు వేరు చేసి ఎక్కించడం ద్వారా రోగికి మేలు కలుగుతుందని వెల్లడించారు.

ఇదే క్రమంలో... ఈ అరుదైన వ్యాధిని గుర్తించిన ప్రాంతంలో నివసిస్తున్న ఇతర పిల్లలందరికీ రక్త పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని గుంటూరు మెడికల్ కాలేజ్ పెథాలజీ విభాగం అధిపతి అపర్ణ తెలిపారు!

ఏంటీ వ్యాధి..?

సికిల్ హిమోగ్లోబిన్ డి- పంజాబ్‌ ను హిమోగ్లోబిన్ డీ (హెచ్.బి.-డీ) అని కూడా పిలుస్తారు. ఇది భారత్ తో పాటు పాకిస్థాన్, ఇరాన్, ఇరాక్‌ వంటి దేశాల్లో ఎక్కువ వ్యాప్తి చెందుతుందట. అయితే.. భారత్ లో మాత్రం వాయువ్య రాష్ట్రాల్లో చిన్నారులకు ఎక్కువగా సోకుతుందని.. ఈ వ్యాధి సోకిన వారు త్వరగా అలసిపోతారని.. వీరిని తరచూ రోగాలు చుట్టుముడుతుంటాయని చెబుతున్నారు!