హెరిటేజ్ షేర్స్ రైజ్ రైజ్.. 5 రోజుల్లో భువనేశ్వరికి రూ.579 కోట్లు
అన్నీ మంచి శకునములే అన్నట్లు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబానికి అంతా మంచే జరుగుతోంది
By: Tupaki Desk | 7 Jun 2024 3:24 PM GMTఅన్నీ మంచి శకునములే అన్నట్లు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబానికి అంతా మంచే జరుగుతోంది. ఐదేళ్లలో ఎన్నో అవమానాలు అనుభవించిన అనంతరం ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అఖండ విజయం సాధించింది. ఇంతలోనే కేంద్రంలో టీడీపీపై ఆధారపడాల్సిన పరిస్థితి బీజేపీకి వచ్చింది. అంటే.. కాలం కలిసి వస్తే ఇంతేనేమో..? మరోవైపు చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని 2021లో అప్పటి అధికార వైసీపీ ఘోరంగా అవమానించింది. అప్పుడే.. శాసనసభకు వస్తే మళ్లీ సీఎంగానే అని చంద్రబాబు సవాల్ చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మంగళవారం టీడీపీ విజయం సాధించడంతో ఆయన స్థాపించిన హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ షేర్లు నాలుగు రోజులుగా రికార్డు స్థాయి పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. గురువారం రోజువారీ గరిష్ట పరిమితి 10 శాతం దాటేశాయి. 1992లో చంద్రబాబు స్థాపించిన ఈ డెయిరీ కంపెనీ దేశవ్యాప్తంగా 10కి పైగా రాష్ట్రాల్లో మార్కెట్ కలిగి ఉంది. కంపెనీలో 24.37 శాతం వాటా భువనేశ్వరిదే. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లో గురువారం ట్రేడింగ్ సమయంలో హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు 10 శాతం పెరిగి ఒక్కో షేరుకు ₹601.15కి చేరుకున్నాయి. ఉదయం 10:10 గంటలకు ఈ స్టాక్ నిఫ్టీలో 0.62 శాతం అడ్వాన్స్ తో పోలిస్తే 7.22 శాతం పెరిగి ₹ 585.95 వద్ద ట్రేడవుతోంది. గత 4 రోజుల్లో కంపెనీ మొత్తం 37.25 శాతం లాభము రాగ, గత 12 నెలల్లో షేరు ధర 183.3% పెరిగింది. గురువారం నాటి మొత్తం ట్రేడింగ్ పరిమాణం 30 రోజుల సగటు కంటే 8.1 రెట్లు ఎక్కువగా నమోదైంది.
5 రోజుల్లో రూ.579 కోట్లు
మార్కెట్ వారాంత అయిన శుక్రవారం కూడా హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ షేర్ల జోరు ఆగలేదు. రికార్డు స్థాయిలో 55 శాతం పెరిగాయి. శుక్రవారం 10 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్ ను తాకాయి. ఎన్నికల ఫలితాల వెల్లడి ముందు రోజు సోమవారం హెరిటేజ్ షేర్ రూ.424గా ఉంది. శుక్రవారం రూ.661కి చేరింది. దీంతో కంపెనీ ప్రమోటర్ అయిన భువనేశ్వరి సంపద ఐదు రోజుల్లో రూ.579 కోట్లు పెరినట్లయింది.