హెజ్బొల్లా భీకర దాడి.. ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ దుర్మరణం? ఇక బీభత్సమే
ఏడాదిగా సాగుతున్న హమాస్-ఇజ్రాయెల్ యుద్ధంలో కీలక మలుపు.
By: Tupaki Desk | 14 Oct 2024 8:18 AM GMTఏడాదిగా సాగుతున్న హమాస్-ఇజ్రాయెల్ యుద్ధంలో కీలక మలుపు. ఇటీవలి కాలంలో హమాస్ ను వదిలేసి లెబనాన్ ఉగ్ర సంస్థ హెజ్బొల్లాను టార్గెట్ చేసిన ఇజ్రాయెల్ కు భారీ షాక్.. ఎవరూ ఊహించని విధంగా.. కనీసం కలలో కూడా తలచుకోని రీతిగా ఇజ్రాయెల్ కు ఎదురుదెబ్బ తగిలింది. అది కూడా ఏకంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) చీఫ్ మృతి చెందినట్లు ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే గనుక తీవ్ర పరిణామాలే ఉంటాయి.
ఐడీఎఫ్ అంటే మామూలు మాటలు కాదు..
అమెరికా నుంచి శ్రీలంక వరకు ప్రపంచంలో ఎన్నో దేశాలకు సైన్యాలు ఉండొచ్చు. కానీ, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐపీఎఫ్) మాత్రం అత్యంత మేటి అని చెప్పక తప్పదు. చాలా చిన్న దేశానికి చెందినదే అయినా..ఐడీఎఫ్ చూపే తెగువ మామూలు స్థాయిలో ఉండదు. అయితే, తాజాగా ఐడీఎఫ్ చీఫ్ నే హతమార్చింది హెజ్బొల్లా అని అంటున్నారు. ఆ దేశంలోని బిన్యమిన ప్రాంతంలో ఉన్న సైనిక స్థావరమే లక్ష్యంగా హెజ్‌బొల్లా మానవ రహిత విమానాలు చేసిన దాడిలో నలుగురు ఇజ్రాయెల్ సైనికులు చనిపోయారని, దాదాపు 67 మంది గాయపడినట్లు తెలుస్తోంది. అయితే, ఐడీఫ్ అధిపతి, లెఫ్టినెంట్ జనరల్ హెర్జిహలేవి కూడా మృతుల్లో ఉన్నట్లు ప్రచారం మొదలైంది. అమెరికా కామెంటేటర్ జాక్సన్ హింక్లె సైతం దీనిని ప్రస్తావించడంతో గగ్గోలు రేగింది. ధ్రువీకరించిన (వెరిఫైడ్) ఎక్స్ ఖాతాల్లోనూ ఇదే ప్రచారమైంది. అయితే, కొద్దిసేపటి తర్వాత ఈ ప్రచారం తప్పంటూ జెరూసలెం పోస్టు కథనం ప్రచురించింది.
ఇజ్రాయెల్ పై అతిపెద్ద దాడుల్లో ఒకటి
హెజ్బొల్లా మానవ రహిత విమానాలు/డ్రోన్లు చేసిన దాడి ఇప్పటివరకు ఇజ్రాయెల్ పై జరిగిన అతిపెద్ద దాడుల్లో ఒకటిగా పేర్కొంటున్నారు. ఈ ప్రదేశం ఐడీఎఫ్ గోలాన్ బ్రిగేడ్ ట్రైనిస్ సెంటర్ లోని మెస్ గా చెబుతున్నారు. కాగా, డ్రోన్ల దండుగా రావడంతో ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఏం చేయలేకపోయినట్లు తెలుస్తోంది. ఐడీఎఫ్ ప్రతినిధి హగారీ మాత్రం.. యుద్ధంపై తమకు పూర్తిగా పట్టు ఉందని ప్రకటించారు. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను మానవ రహిత విమానం ఎలా తప్పించుకొందో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
దాడి చేసింది దీంతోనే..
లక్షన్నర రాకెట్లు హెజ్బొల్లా సొంతం. అయితే, దాని దగ్గర ఉన్న మిర్సాద్-1 రకం చాలా కీలకంగా చెబుతారు. దీంతోనే తాజాగా దాడి చేసిందని తెలుస్తోంది. 3 వేల మీటర్ల ఎత్తు దాకా ఎగురుతూ 40 కేజీల పేలుడు పదార్థాలతో ఈ డ్రోన్ 120 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై గంటకు 370 కిలోమీటర్ల వేగంతో దాడి చేస్తుందట. ఇరాన్ సూసైడ్ డ్రోన్ మొహాజిర్-2 శ్రేణికి చెందినది మిర్సాద్-1.. హెజ్‌బొల్లా ప్రధాన డ్రోన్. రెండేళ్లుగా వాడుతోంది. ఉగ్ర సంస్థ భారీ సంఖ్యలో రాకెట్లతో కలిపి మిర్సాద్-1 డ్రోన్లను ప్రయోగించిందని.. అందుకే ఇజ్రాయెల్ అడ్డుకోలేకపోయిందని నిపుణులు చెబుతున్నారు. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను డ్రోన్లు తప్పించుకోవడం తొలిసారి అని ఇజ్రాయెల్ చెప్పింది.
ఐడీఎఫ్ చీఫ్ చనిపోతే..
తమ డిఫెన్స్ ఫోర్స్ చీఫ్ చనిపోతే ఇజ్రాయెల్ ప్రతీకారం ఎలా ఉంటుందో ఊహించలేం.. దీనికి అమెరికా కూడా తోడుగా వస్తుంది. అసలే ఇరాన్ పై రేపోమాపో దాడి చేసేలా, వారి అణు స్థావరాలను లక్ష్యం చేసుకునేలా ఉంది ఇజ్రాయెల్. ఈ క్రమంలో ఐడీఎఫ్ చీఫ్ మరణం వారిని విపరీతంగా రెచ్చగొట్టినట్లే అవుతుంది.