Begin typing your search above and press return to search.

ఫుట్ బాల్ ఆడుతున్న పిల్లలపైకి రాకెట్లు.. పశ్చిమాసియాలో మరో యుద్ధం?

హెజ్బొల్లా ప్రపంచంలోనే ప్రమాదకర ఉగ్ర సంస్థ. దీనికి లెబనాన్‌ అండ ఉంది.

By:  Tupaki Desk   |   28 July 2024 11:28 AM GMT
ఫుట్ బాల్ ఆడుతున్న పిల్లలపైకి రాకెట్లు.. పశ్చిమాసియాలో మరో యుద్ధం?
X

మతపరంగా, సైనికపరంగా ప్రపంచంలో అత్యంత సున్నితమైన ప్రాంతం ఏదైనా ఉందంటే అది పశ్చిమాసియానే (అమెరికాకు మిడిల్ ఈస్ట్). యూదుల గడ్డ ఇజ్రాయెల్.. చుట్టూ ముస్లిం దేశాలు. 75 ఏళ్లుగా ఎన్నో ఉద్రిక్తతలు.. యుద్ధాలు.. గత ఏడాది అక్టోబరు నుంచి ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో అగ్నిగుండంలా రగులుతోంది. ఇప్పటికే ఈ యుద్ధంలో వేలు పెట్టాలని చూస్తున్న హెజ్బొల్లా శనివారం ఏకంగా ఇజ్రాయెల్ లోని ఫుట్ బాల్ మైదానంపైకి రాకెట్లు ప్రయోగించింది. దీంతో పశ్చిమాసియా పుండు మరోసారి రగులుకుంది.

లెబనాన్ గడ్డపై నుంచి..

హెజ్బొల్లా ప్రపంచంలోనే ప్రమాదకర ఉగ్ర సంస్థ. దీనికి లెబనాన్‌ అండ ఉంది. తాజాగా లెబనాన్ నుంచే రాకెట్లు ప్రయోగించింది. ఇవి ఇజ్రాయెల్ లోని మాజ్‌దల్‌ షామ్స్‌ లో సాకర్ ఆడుతున్న 12 మంది ఇజ్రాయెల్ పిల్లలు, యువత ప్రాణాలు బలిగొన్నాయి. దీంతో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. అది ఎంతగా అంటే.. ప్రస్తుతం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆ పర్యటనను అర్థంతరంగా రద్దు చేసుకుని ఆయన ఇజ్రాయెల్ వచ్చేశారు. పిల్లల హత్యకు హెజ్‌బొల్లా పై తీవ్ర ప్రతీకారం తప్పదని హెచ్చరించారు. వాస్తవానికి అక్టోబరు 7న హమాస్ ఇజ్రాయెల్ పై దాడి చేసింది. మరుసటి రోజు.. అంటే 8వ తేదీ నుంచే ఇజ్రాయెల్‌-లెబనాన్‌ మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. అయితే, శనివారం నాటి తరహాలో హెజ్‌బొల్లా ఇంత పెద్ద దాడి ఎపుడూ చేయలేదు. దీంతోనే నెతన్యాహూ తీవ్రంగా స్పందించారు. గతంలో ఎన్నడూ చూడనంత మూల్యం తప్పదని హెచ్చరించారు.

9 నెలలుగా దాడులు..

హెజ్బొల్లా (లెబనాన్ )ను ఇంతకాలం ఓపిక పట్టింది ఇజ్రాయెల్‌. అయితే, ఫుట్ బాల్ ఆడుతుండగా హెజ్‌బొల్లా చేసిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల మృతదేహాలకు అంతిమయాత్రలో వేల మంది పాల్గొన్నారు. ఇది ఒకప్పుడు రోజుల తరబడి యుద్ధం సాగిన గోలన్‌ హైట్స్‌ లోని డ్రూజ్‌టౌన్‌ లో ఉంది. చిన్నారుల అంతిమయాత్రకు వచ్చిన ఇజ్రాయెల్ మంత్రులను ‘మీకు సిగ్గులేదా’ అంటూ దూషించారు. 9 నెలలుగా లెబనాన్‌ మీదుగా దాడులు జరుగుతున్నా తమని వదిలేశారని నిందించారు. దీంతోనే లెబనాన్‌ తో ఇజ్రాయెల్ పూర్తి స్థాయి యుద్ధానికి దిగుతుందనే అంచనాలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ ప్రభుత్వ ప్రకటనలు కూడా ఇలాగే ఉన్నాయి. అమెరికాలోని బైడెన్‌ సర్కారు.. ఇన్ని నెలల నుంచి దేన్నైతే అడ్డుకొన్నామో.. అదే జరిగేట్లుంది అని వ్యాఖ్యానించడం గమనార్హం.

ఓవైపు గాజా.. మరోవైపు లెబనాన్

గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం మొదలయ్యాక- ఇజ్రాయెల్‌ పైకి హెజ్‌బొల్లా అతిపెద్ద రాకెట్‌ దాడి జరడంతో మరో ప్రత్యక్ష యుద్ధం తప్పదా? తీవ్రమవుతుందా? అనే అనుమానాలు వస్తున్నాయి. తాజా దాడి తమ పని కాదని హెజ్‌బొలా చెబుతున్నా.. ఇజ్రాయెల్‌ మాత్రం వినడం లేదు. హెజ్‌బొల్లాతో తాడో పేడో తేల్చుకుంటామని స్పష్టం చేస్తోంది.