హెచ్1బీ వీసా రెన్యువల్ ప్రోగ్రాం షురూ.. మనోళ్లకు స్వీట్ న్యూస్
ఈ పైలెట్ ప్రాజెక్టులో తొలుత భారతీయులకు.. కెనడా దేశీయులకు మాత్రమే అవకాశం ఇస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 31 Jan 2024 7:05 AM GMTఅందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అన్న నిరీక్షణకు తెర దించుతూ తమ కొత్త తరహా హెచ్1బీ వీసా రెన్యువల్ కార్యక్రమాన్ని అమెరికా ప్రారంభించింది. ఈ పైలెట్ ప్రాజెక్టులో తొలుత భారతీయులకు.. కెనడా దేశీయులకు మాత్రమే అవకాశం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు అమలు అయిన నిబంధనల ప్రకారం హెచ్ 1బీ వీసాదారులు ఎవరైనా తమ వీసా రెన్యువల్ కోసం వారి దేశాలకు వెళ్లి.. మళ్లీ స్టాంపింగ్ వేసుకొని రావాల్సి ఉంటుంది. ఇదో వ్యయప్రయాసలకు గురయ్యే ప్రక్రియ.
దీనికి చెక్ చెప్పేలా అమెరికా ప్రభుత్వం సరికొత్త విధానానికి తెర తీసింది. ఈ విధానంలో హెచ్1బీ వీసాల రెన్యువల్ కోసం ఆయా దేశాల వారు.. వారి దేశాలకు వెళ్లి రెన్యువల్ చేయించుకోవాల్సిన అవసరం లేకుండా అమెరికాలోనే ఉండి రెన్యువల్ చేసుకునే వీలు కల్పించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కొన్ని దేశాలకు ఈ వసతి కల్పిస్తూ పైలెట్ ప్రాజెక్టును చేపట్టి.. వాటి ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలని భావించారు.
తొలిదశలో కేవలం భారతీయులకు.. కెనడా వాసులకు ఈ తరహా వసతిని కల్పించారు. ఐదు వారాలపాటు ఈ పథకాన్ని అందుబాటులో ఉంచనున్నారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం నుంచి షురూ చేశారు. ప్రతివారం నాలుగు వేల చొప్పున వీసాల్ని రెన్యువల్ చేస్తారు. 2020 జనవరి 1 నుంచి జనవరి 2023 ఏప్రిల్ 1 మధ్య కెనడా పౌరులకు జారీ చేసిన వీసాలు.. 2021 ఫిబ్రవరి 1 నుంచి 2021 సెప్టెంబరు 30 మధ్య వరకు భారతీయులకు జారీ చేసిన వీసాల్ని అమెరికాలోనే ఉండి రెన్యువల్ చేసుకునే వీలును ఈ పైలెట్ ప్రాజెక్టులో కల్పించారు. ఈ దశలో మొత్తం 20వేల వీసాల్ని అమెరికాలోనే రెన్యువల్ చేయనున్నారు. ఈ విధానం భారతీయులకు తీపి కబురుగా చెప్పక తప్పదు.