Begin typing your search above and press return to search.

వెంటాడుతున్న కళ్ళు...సేఫ్ జోన్ ఎక్కడ ?

టెక్నాలజీ మనిషిని మింగేసింది. అదే రూపాయి తెచ్చిపెడుతోంది. అదే నైతిక పతనానికి బాటలు పరుస్తోంది.

By:  Tupaki Desk   |   1 Sep 2024 5:30 AM GMT
వెంటాడుతున్న కళ్ళు...సేఫ్ జోన్ ఎక్కడ ?
X

టెక్నాలజీ మనిషిని మింగేసింది. అదే రూపాయి తెచ్చిపెడుతోంది. అదే నైతిక పతనానికి బాటలు పరుస్తోంది. ఒకనాడు నైతిక విలువలు అన్న చర్చ ఉండేది. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక యుగంలో ఎథిక్స్ అంటే మతి లేని మాటలుగా మారిపోయాయి. నీతి గురించి మాట్లాడితే గోతిలో పెట్టి పాతర వేస్తున్నారు.

సమాజం మొత్తం ఇపుడు బట్ట బయలు అయిపోయింది. మాటు చాటు అన్నవి లేనే లేవు. అంతా బాహాటమే. అంతా గుడ్డ విడిచిన చందమే. ఎవరికీ ఇక్కడ సేఫ్ జోన్ లేదు. అందరూ కెమెరా నీడలోనే ఉన్నారు. ఎవరిని ఎవరు చూస్తున్నారో ఎలా రికార్డు చేస్తున్నారో పైన ఉన్న పరమాత్ముడికే ఎరుక. దొరికితే దొంగ లేకపోతే లేదు. అయినా టెక్నాలజీని ఆపేదెవరు. అది ఒక భూతంగా మారిందా అంటే దానికి ఒక్కటే మాట. కత్తి పదునైనదే దాంతో పీక కోసుకుంటారా లేక కూర తరుక్కుంటారా అన్నది మనిషి విచక్షణ మీదనే ఆధారపడి ఉంది.

బంగారు బాతు గుడ్ల కోసం బాతునే ఒకేసారి చంపే అవినీతి కధల నుంచి పుట్టి పెరిగిన కాలంలో పీకనే తరుక్కోవడానికి సిద్ధమైన లోకంలో నైతికత అన్న పరదా ఉందేమో అని వెతకడం వెర్రిబాగుల తనమే అంటే ఆశ్చర్యం పోనవసరం లేదు. నిజం చెప్పాలంటే నిరంతరం మనిషిని కళ్ళు వెంటాడుతూనే ఉన్నాయి.

ఎక్కడికి వెళ్ళినా సీసీ కెమెరాల మధ్యనే మనిషి బంధీ అవుతున్నాడు. అందులో హిడెన్ కెమెరాలు ఒక బిజినెస్ గా మారిపోయాయి. షాపింగ్ మాల్స్ లోనూ లాడ్జీలలోనూ హొటళ్లలోనూ ప్రైవసీ మాటున హిడెన్ కెమెరా కూడా ఉంటోంది. షాపులలో సెలక్షన్ చేసుకుంటూ బట్టలు మార్చుకునే గదులకు వెళ్తే అక్కడ కూడా హిడెన్ కెమెరాలు ప్రత్యక్షం అవుతున్నాయి. కాదేదీ అనర్హం అన్న తీరున అవి ఉంటున్నాయి.

లేటెస్ట్ గా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్ధినుల బాత్ రూం లలో హిడెన్ కెమెరాలు అమర్చారని వదంతుల మధ్య ఒక పెద్ద వివాదమే సాగింది. అర్ధరాత్రి అమ్మాయిలు వర్షంలో ఆరు బయటకు వచ్చి ఆందోళన చేశారు అంటే హిడెన్ కెమెరా ఎపిసోడ్ లో ఏమి జరిగింది అన్నది చూడాల్సిందే.

మాన ప్రాణాలు అతి ముఖ్యమైనవి అని పురాణ కాలం నుంచి చెప్పుకున్న భారత దేశంలో ఇపుడు ఆ రెండూ కరువు అన్నట్లుగానే పరిస్థితి ఉంది. ముఖ్యంగా మహిళల మానానికి భద్రత లేదు. దానికి గుట్టూ మట్టూ కూడ లేకుండా హిడెన్ కెమెరా దోచేస్తోంది. ఆ భయంకరమైన కెమెరా కన్ను నుంచి తప్పించుకోవడం కష్టతరం అవుతోంది.

ఇలా న్యూడ్ గా ఉన్న వారి వీడియోలను తీసి దానిని షేర్ చేయడంతోనే సరిపెడుతున్నారా లేక దీనిని బిజినెస్ చేసుకుంటూ పోతున్నారా అన్నది తేలాల్సి ఉంది. ప్రతీదీ వ్యాపారమే. ముఖ్యంగా నగ్నత్వంతో వ్యాపారం చేయడం ఒక అందమైన బిజినెస్ గా ఇటీవల కాలంలో మారుతోంది. అంతా టెక్నాలజీ పుణ్యం. పోర్న్ కల్చర్ బాగా పెరిగిపోతున్న రోజులలో న్యూడ్ అంటే అతి చిన్న విషయంగా మారిపోతున్న వాతావరణంలో ఎక్కడ ఏది దొరికినా బంధించే హిడెన్ కెమెరాలు అన్నీ చూసేస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త.