సునీత ముందు మరో కఠిన సవాలు.. ఎంత కష్టమంటే?
భూమి మీద నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఎనిమిది రోజులు వెళ్లి వచ్చేందుకు గత ఏడాది వెళ్లిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ గడిచిన తొమ్మిది నెలలుగా అక్కడే చిక్కుకుపోయిన పరిస్థితి.
By: Tupaki Desk | 19 March 2025 10:40 AM ISTభూమి మీద నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఎనిమిది రోజులు వెళ్లి వచ్చేందుకు గత ఏడాది వెళ్లిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ గడిచిన తొమ్మిది నెలలుగా అక్కడే చిక్కుకుపోయిన పరిస్థితి. కొద్ది గంటల క్రితమే భూమీ మీదకు చేరుకున్న ఆమె.. మళ్లీ యథావిధిగా తన రోజువారీ పనిని చేసుకుంటారా? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. విస్మయానికి గురి కావాల్సిందే. ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉండిపోవటం వల్ల ఆమెకు పలు ఆరోగ్య సమస్యలు ఎదురుకానున్నాయి.
భారరహిత స్థితిలో తేలియాడే వ్యోమగాముల్ని చూసినప్పుడు సరదాగా అనిపించినా.. అదే ఇప్పుడు పెద్ద కష్టంగా మారనుంది. దీనికి కారణం.. దీర్ఘకాలం భారరహిత స్థితిలో ఉండటం వల్ల ఎముకలు.. కండరాల సాంద్రత తగ్గిపోవటంతో పలు సమస్యలకు కారణంగా మారుతుంది. భూమికి తిరిగి వచ్చిన తర్వాత గురుత్వాకర్షణ శక్తికి అలవాటు పడటం అంత తేలికైన విషయం కాదు. ఈ క్రమంలో వారి ముందున్న తక్షణ సవాళ్లు ఏమిటో తెలుసా?
- నిలబడటం
- చూపును స్థిరంగా ఉంచటం
- నడవటం
- పక్కకు తిరగటం
- గ్రావిటీ సిక్ నెస్
గురుత్వాకర్షణ లేని చోట ఎక్కువకాలం ఉండే వ్యోమగాములు నడక కోసం కదలికల కోసం ఎక్కువగా శ్రమించాల్సి ఉండదు. దీంతో వారి ఎముకలు.. కండరాల మీద భారం ఉండదు.దీంతో వాటిలో క్షీణత మొదలవుతుంది. దీంతో వారు మిగిలినవారి మాదిరిరోటీన్ లైఫ్ కోసం వారాల తరబడి ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. రోదసిలో ఎక్కువకాలం గడిపితే వచ్చే సమస్యల్లో ముఖ్యమైంది.. రోదసిలో ఎముకలు కణజాలాలు తమ తీరు తెన్నులు మార్చుకుంటాయి. కొత్త ఎముకలు కణజాలాన్ని నిర్మించే కణాలు నెమ్మదిస్తాయి. పాత ఎముక కణజాలాన్ని విచ్ఛిన్నంచేసే ప్రక్రియ యథావిధిగా సాగుతుంది. దీంతో వ్యోమగాముల్లో ఎముక సాంద్రత తగ్గుతుంది.
మరింత వివరంగా చెప్పాలంటే.. రోదసిలో ఉండే ప్రతి 30 రోజుల కాలానికి వ్యోమగాముల ఎముకలు ఒకటి నుంచి రెండు శాతం మేర సాంద్రత కోల్పోతాయి. ఆరు నెలల్లో ఇది కాస్తా పదిశాతంగా మారుతుంది.అదే భూమి మీద పెద్ద వయస్కుల్లో ఏడాదికి ఇది 0.5 నుంచి ఒక శాతం మేర క్షీణత ఉంటుంది. ఈ కారణంగా వ్యోమగాముల్లో ఎముకలు విరిగే ముప్పు ఎక్కువగా ఉంటుంది. భూమికి తిరిగి వచ్చిన తర్వాత వ్యోమగాముల్లో ఎముక సాంద్రత తిరిగి సాధారణ స్థాయికి రావటానికి పట్టే సమయం అక్షరాల నాలుగేళ్ల వరకు చెబుతారు.
ఈ సమస్యను అధిగమించటానికి వ్యోమగాములు ఎస్ఎస్ లో కఠోర వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. రోజుకు రెండు గంటల పాటు ట్రెడ్ మిల్ లేదంటే ఇతర కసరత్తులు చేయాల్సి ఉంటుంది. రోదసిలో 2 వారాలు గడిపిన తర్వాత కండరాలు 20 శాతం క్షీణించొచ్చు. మూడు నుంచి ఆర్నెల్ల కాలం గడిపితే ఈ క్షీణత 30 శాతానికి చేరుతుంది. మనం పెద్దగా పట్టించుకోం కానీ చెవిలోని వెస్టిబ్యులర్ అనే అవయువం మనం తుళ్లి పడిపోకుండా కాపాడుతుంది. భూమి మీద నడిచేటప్పుడు ఇదెంతో కీలకంగా వ్యవహరిస్తుంది.
రోదసిలో ఎక్కువ కాలం ఉండటం వల్ల వెస్టిబ్యులర్ అవయువాలకు అందే సమాచారం మారుతుంది. దీంతో మెదడు కన్ఫ్యూజన్ కు గురవుతుంది. ఇది స్పేస్ సిక్ నెస్ కు దారి తీస్తుంది. దీంతో కళ్లు తిరగటం.. తలనొప్పి.. కడుపులో చిరాకు.. వాంతులు.. వికారం లాంటి సమస్యలు ఉంటాయి. భూమికి తిరిగి వచ్చిన తర్వాత గ్రావిటీ సిక్ నెస్ బారి నుంచి బయటకు రావాల్సి ఉంటుంది.
కంటిచూపు విషయంలోనూ సమస్యలు తలెత్తవచ్చు. భూమి మీద ఉండే గురుత్వాకర్షణ శక్తి.. రక్తం.. ఇతర ద్రవాలను శరీరంలోని దిగువ భాగాల్లోకి లాగుతుంది. గుండె వాటిని పైకి పంప్ చేసేలా చేస్తుంది. రోదసిలో ఈ మొత్తం ప్రక్రియ గందరగోళానికి గురవుతుంది. దీంతో శరీరం ఎగువ భాగంలో సాధారణం కన్నా ఎక్కువగా రక్తం.. ద్రవాలు పేరుకుపోతాయి. ఈ కారణంగానే కొందరు వ్యోమగాములు కొంత ఉబ్బినట్లుగా కనిపిస్తారు. తలలో.. రక్తం.. ద్రవం పేరుకుపోయిన కారణంగా వినికిడి సమస్యకు దారి తీయొచ్చు.రోదసిలో ఎక్కవ కాలం ఉండటం వల్ల గుండె షేప్ కూడా మరుతుంది. భూమికి చేరుకున్న తర్వాత బీపీని కంట్రోల్ చేయటం ఒక సవాలు.
రోదసిలో ఎక్కువ కాలం ఉన్న కారణంగా భారరహిత నాలుక పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో మాటలో మార్పు వస్తుంది. ఇక.. వ్యోమగాముల్లో పాదాల్లో ఉండే దళసరి చర్మాన్ని కోల్పోతారు. దీంతో వారి పాదాలు పసిపిల్లల్లో ఉన్నట్లుగా సెన్సిటివ్ గా మారి.. నడవటం కష్టంగా మారుతుంది. భూకక్ష్యలో ఉండే రేడియో ధార్మికకారణంగా తెల్ల రక్త కణాలు తగ్గే ప్రమాదం ఉంది. దీంతో వారి రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడొచ్చు. అంతేకాదు.. వ్యోమగాములకు క్యాన్సర్.. ఇతర ఆరోగ్య సమస్యల ముప్పు ఉంటుంది.