'హిడ్మా' హతం.. మేమే చంపేశాం: మధ్యప్రదేశ్ పోలీసులు
మహారాష్ట్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో తన చర్యల ద్వారా ప్రభుత్వాలను గడగడలాడించిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ మడకం హిడ్మా అలియాస్ చైతును హతమార్చినట్టు మధ్యప్రదేశ్ పోలీసులు ప్రకటించారు.
By: Tupaki Desk | 15 Dec 2023 3:05 PM GMTమహారాష్ట్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో తన చర్యల ద్వారా ప్రభుత్వాలను గడగడలాడించిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ మడకం హిడ్మా అలియాస్ చైతును హతమార్చినట్టు మధ్యప్రదేశ్ పోలీసులు ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లా ఖాంకోదాదర్ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగిందని తెలిపారు. అయితే.. హిడ్మా మృతిపై మావోయిస్టు కేంద్ర కమిటీ ఇప్పటి వరకు స్పందించలేదు.
ఎవరీ హిడ్మా..
హిడ్మా.. అలియాస్ చైతు.. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్ జిల్లా మిర్తుర్‌కు చెందిన మావోయిస్టు. ప్రస్తుతం ఆయన వయసు 40 ఏళ్లు. కేవలం 7వ తరగతి మాత్రమే చదివిని హిడ్మా.. 17 ఏళ్ల వయసులో 1996లో మావోయిస్టు పార్టీలో చేరాడు. తర్వాత మావోయి స్టులకు అవసరమైన ఆయుధాల తయారీ విభాగంలో పనిచేశాడు. అలాగే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీలోనూ పని చేశాడు. దళాలను నడిపించడంలో, తుపాకీ పేల్చడంలో హిడ్మా నేర్పరి కావడంతో ఎన్నోసార్లు ఎన్‌కౌంటర్ల నుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడు.
పోలీసులే టార్గెట్
కీలక మావోయిస్టుగా పేరొందిన హిడ్మా.. అనేక ఆపరేషన్లలో పోలీసులే లక్ష్యంగా దూకుడు చూపించాడు. 2010లో జరిగిన తాడిమెట్ల ఘటనలో 76 మంది పోలీసుల దుర్మరణానికి కారణమయ్యాడు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్ అయ్యాడు. హిడ్మాపై రూ.14 లక్షల రివార్డు కూడా ఉంది.
గతంలోనూ ఇలాంటి వార్తలే..
హిడ్మా చినపోయాడంటూ గతంలోనూ వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తలు వచ్చిన కొద్ది రోజులకే తాను బతికే ఉన్నానంటూ హిడ్మా పోలీసులకే సవాల్ విసురుతూ వచ్చాడు. దీంతో ప్రస్తుతం హిడ్మా మృతిపై అనేక మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బాలాఘాట్ జిల్లా ఖామ్‌కోదాదర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టు దళాలు తిష్ట వేసినట్లు మధ్యప్రదేశ్‌కు చెందిన హాక్ ఫోర్స్ సిబ్బందికి పక్కా సమాచారం అందింది. దీంతో వెంటనే అక్కడ పోలీసులను మోహరించారు. పోలీసులు రావడాన్ని గమనించిన మావోలు ఎదురుకాల్పులు చేశారు. హోరాహోరీ కాల్పులులో హిడ్మా మృతి చెందాడు.