తులసిబాబుకు షాక్.. వదలని రఘురామరాజు
డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న నిందితుడు కామేపల్లి తులసిబాబుకు హైకోర్టులో షాక్ తగిలింది.
By: Tupaki Desk | 14 Feb 2025 7:20 AM GMTడిప్యూటీ స్పీకర్ రఘురామరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న నిందితుడు కామేపల్లి తులసిబాబుకు హైకోర్టులో షాక్ తగిలింది. బెయిల్ కోసం ఆయన హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. మరోవైపు తులసిబాబుకు అర్హత లేకపోయినా సీఐడీ న్యాయవాదిగా భారీ ఫీజు వసూలు చేశారని ఆరోపిస్తూ రఘురామ ఏసీబీకి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.
తులసిబాబు బెయిల్ పిటిషన్ పై గతంలోనే వాదనలు పూర్తయ్యాయి. తీర్పును రిజర్వు చేసిన న్యాయస్థానం శుక్రవారం తన నిర్ణయాన్ని వెల్లడించింది. తులసిబాబు ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. మరోవైపు ఏపీ సీఐడీలో న్యాయసలహాదారుగా ఆయన పనిచేసి, లక్షల రూపాయలను తీసుకున్నాడని ఇటీవల వెలుగుచూసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రశ్నించేందుకు తులసిబాబును ఒకరోజు కస్టడీకి తీసుకున్న పోలీసులు.. ఒంగోలు తరలించి విచారించారు. సీఐడీ నుంచి రూ.48 లక్షలు తీసుకోవడంపై తులసిబాబును ఎస్ఫీ దామోదర్ ప్రశ్నించారని చెబుతున్నారు. సీఐడీ కేసులు ఏమైనా వాదించావా? ఏ కేసు వాదించావు అని ప్రశ్నించినట్లు సమాచారం. అర్హత లేకున్నా సీఐడీ లీగల్ అసిస్టెంట్ గా ఎలా చేరావు? ఎవరు సహకరించారనేది విచారణలో తెలుసుకునే ప్రయత్నం చేశారు. అదేవిధంగా సీఐడీ అప్పటి డీజీ సునీల్ కుమారుతో సంబంధాలపైనా ఆరా తీసినట్లు సమాచారం.
మరోవైపు తులసిబాబుకు సీఐడీ రూ.48 లక్షలు చెల్లించడంపై విచారణ జరపాలని కోరుతూ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ మొత్తం చెల్లింపుల్లో అవినీతి జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆయన ఏసీబీని కోరారు.