గ్రూప్-1 మెయిన్స్ పై హైకోర్టు కీలక తీర్పు
కాగా, ఈ రోజు అశోక్ నగర్‌లో ఆందోళనకు దిగిన అభ్యర్థుపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
By: Tupaki Desk | 18 Oct 2024 2:09 PM GMTతెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల వాయిదా వ్యవహారం కాక రేపుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు ఈ నెల 21 నుంచి 27 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించేందుకు టీజీపీఎస్సీ సిద్ధమవుతుండగా మరోవైపు పరీక్ష తేదీలు వాయిదా వేయాలని అభ్యర్థులు నిరసనలు, ఆందోళనలకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే, పరీక్షలు యథావిధిగా నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. కానీ, ఆ తీర్పుపై డివిజన్ బెంచ్ ను అభ్యర్థులు ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఆ వ్యవహారంపై డివిజన్ బెంచ్ కీలక తీర్పునిచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. దీంతో, ఈ నెల 21 నుంచి 27 వరకు షెడ్యూల్ ప్రకారమే గ్రూప్-1 పరీక్షలు జరగనున్నాయి.
కాగా, ఈ రోజు అశోక్ నగర్‌లో ఆందోళనకు దిగిన అభ్యర్థుపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. జీవో 29ని రద్దు చేసే వరకు తమ పోరాటం ఆపబోమని విద్యార్థులు నినాదాలు చేసి ప్లకార్డులతో తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ లాఠీఛార్జ్ వ్యవహారంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. విద్యార్థులు న్యాయం కోసం డిమాండ్ చేస్తుంటే లాఠీఛార్జ్ చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్రిలిమనరీ కీ లో తప్పులు దొర్లాయని, వాటిని రీ వెరిఫై చేసి ఫలితాలు మళ్లీ విడుల చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. కానీ, అటువంటిది లేదని, మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహణకు టీజీపీఎస్సీ తేదీలను ప్రకటించింది. ఈ క్రమంలోనే విద్యార్థులు పది రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసనలు తెలుపుతున్నారు.