భారత్ లోనే ఎక్కువ ఆత్మహత్యలు.. ఎందుకో తెలుసా?
చిన్న చిన్న కారణాలకు, వైఫల్యాలకు ఆత్మహత్యలు చేసుకునేవారి సంఖ్య పెరిగిపోయింది.
By: Tupaki Desk | 11 Sep 2024 5:23 AM GMTచిన్న చిన్న కారణాలకు, వైఫల్యాలకు ఆత్మహత్యలు చేసుకునేవారి సంఖ్య పెరిగిపోయింది. ఆత్మహత్యను మహా పాపంగా ఆయా మతాలు పేర్కొంటున్నాయి. నిపుణులు, సైకాలజిస్టులు ఆత్మహత్యల నివారణపై పెద్ద ఎత్తున కౌన్సెలింగ్ ఇస్తున్నారు.. అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా విద్యా సంస్థల్లో ఆత్మహత్యల నివారణకు కౌన్సెలింగ్ సెషన్లు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఆత్మహత్యలకు అడ్డుకట్ట పడటం లేదు.
తాజాగా సెప్టెంబర్ 10న ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవంగా సందర్భంగా నిపుణులు బాంబుపేల్చారు. ప్రపంచంలో ఇతర దేశాల కంటే భారత్ లోనే ఆత్మహత్యలు ఎక్కువని తేల్చారు.
ఆత్మహత్యల నివారణపై అవగాహన పెంచడానికి, వీటిపై పోరాడటానికి ఏటా సెప్టెంబర్ 10 ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ‘ఆత్మహత్యలపై దృక్పథాన్ని మార్చడం’ను థీమ్ గా తీసుకున్నారు.
భారతదేశంలో 15–19 సంవత్సరాల మధ్య వారి మరణాల్లో ఆత్మహత్య నాలుగోదిగా నిలుస్తోంది. నేషనల్ క్రై మ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) గణాంకాల ప్రకారం.. ఆత్మహత్యలకు పాల్పడే కేసుల్లో 40 శాతానికి పైగా 30 ఏళ్లలోపు యువకులే కావడం గమనార్హం. ఎన్‌సీఆర్‌బీ గణాంకాల ప్రకారం .. 2022లో 1.71 లక్షల మంది మనదేశంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవి లెక్కతేలినవి మాత్రమే. ఇంకా లెక్కలోనికి రానివి చాలా ఉన్నాయంటున్నారు.
భారతదేశంలో ఆత్మహత్యల ద్వారా మరణించే యువకుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని ఎయిమ్స్ ఢిల్లీలోని సైకియాట్రీ ప్రొఫెసర్ నందకుమార్ వెల్లడించారు. ప్రపంచ సగటుతో పోలిస్తే భారత్ లో ఆత్మహత్య చేసుకున్న యువకుల సంఖ్య దాదాపు రెట్టింపుగా ఉండటం సర్వత్రా ఆందోళన రేపుతోందన్నారు. భారతదేశంలో రోజుకు సుమారు 160 మంది యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన బాంబుపేల్చారు.
ఒత్తిడితో కూడిన కుటుంబ వాతావరణాలు, అస్థిర, నిలకడ లేని భావోద్వేగాలు, మత్తు పదార్థాల వినియోగం, లవ్ ఫెయిల్యూర్స్, స్నేహితుల మధ్య బలహీనమైన బంధం, ఒంటరితనం ఆత్మహత్యలను ప్రేరేపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
15 నుండి 39 సంవత్సరాల వయస్సు గల వ్యక్తుల్లో మరణానికి ఆత్మహత్య ప్రధాన కారణంగా నిలుస్తోందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా, మన దేశంలో మనం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన ప్రజారోగ్య సంక్షోభాలలో ఒకటి.. ఆత్మహత్య అని అని లైవ్ లవ్ లాఫ్ సంస్థ సైకియాట్రిస్ట్, ఆ సంస్థ చైర్‌పర్సన్ అయిన డాక్టర్ శ్యామ్ భట్ తెలిపారు.
మానసిక ఆరోగ్య సంక్షోభాన్ని పరిష్కరించడానికి, ఆత్మహత్యలను నివారించడానికి ప్రభుత్వం నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్, కిరణ్ హెల్ప్‌లైన్ వంటి కార్యక్రమాలను ప్రారంభించింది.
అయితే, ఆత్మహత్యల రేటును తగ్గించడానికి ఎక్కువ అవగాహన, సంరక్షణ కల్పించడం, అంతర్లీనంగా ఉన్న సామాజిక ఆర్థిక సమస్యలను పరిష్కరించడం చాలా అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మానసిక ఆరోగ్యాలను నయం చేయాల్సి ఉంటుందంటున్నారు. మానసిక సవాళ్లతో పోరాడుతున్నవారికి సహాయం చేయడం, వారి పట్ల దయతో వ్యవహరించడం అవసరమని చెబుతున్నారు. ఇది సమాజం బాధ్యత కావాలంటున్నారు.