ఓటెత్తిన ఉత్తరాంధ్ర.. 86 శాతం పోలింగ్!
ఏపీలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర జిల్లాల ఓటర్లు తమ చైతన్యం చూపించారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ జరుగుతోంది.
By: Tupaki Desk | 27 Feb 2025 9:29 AM GMTఏపీలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర జిల్లాల ఓటర్లు తమ చైతన్యం చూపించారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ జరుగుతోంది. ఉద యం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ 4 గంటల వరకు జరగనుంది. అయితే.. ఇక్కడ మధ్యాహ్నం 2 గంటల సమయానికే 86 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారులు ప్రకటన చేశారు.
ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు కీలక వ్యక్తుల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. వీరిలో పాకాలపాటి రఘువర్మ ఏపీటీఎఫ్(ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్) తరఫున పోటీలో ఉన్నారు. అలానే.. మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు పీఆర్ టీయూ తరఫున పోటీ చేస్తున్నారు. మరో ముఖ్య నాయకుడు కోరెడ్ల విజయగౌరి యూటీఎఫ్ నుంచి బరిలో ఉన్నారు. మరో ఏడుగురు స్వంతంత్రులుగా కూడా పోటీ చేస్తున్నా.. ప్రధాన పోటీ మాత్రం ఈ ముగ్గురి మధ్యే కొనసాగుతోంది.
ఇక, ఏపీటీఎఫ్ నుంచి బరిలో ఉన్న పాకాలపాటి రఘువర్మకు కూటమి పార్టీల్లో టీడీపీ, జనసేన మద్దతు ఇస్తున్నాయి. మరోవైపు.. ఇదే కూటమికి చెందిన బీజేపీ.. పీఆర్ టీయూ నుంచి బరిలో ఉన్న గాదె శ్రీనివాసుల నాయుడుకు మద్దతు ప్రకటించింది.(ఈ విషయంలో బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి మౌనం వహించారు). అయితే.. వైసీపీ ఇక్కడ ఎవరికీ మద్దతు ప్రకటించలేదు. ఇదిలావుంటే పోలింగ్ విషయానికి వస్తే.. టీడీపీకి చెందిన రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు సహా.. ఇతర నాయకులు ఉత్తరాంధ్రలోనే తిష్ఠ వేశారు.
కూటమి అభ్యర్థిగా ఉన్న రఘువర్మను గెలిపించాలని వారు విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో భారీ ఎత్తున ఓటింగ్ జరుగుతోంది. ఇతర రెండు గ్రాడ్యుయేట్ స్థానాలతో పోల్చుకుంటే.. ఉత్తరాంధ్రలో మధ్యాహ్నం 2 గంటలకే 86 శాతం పోలింగ్ నమోదు కావడంతో కూటమి నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల పోలింగ్ సమయం ముగిసే నాటికి 14 శాతం కూడా పూర్తి అవుతుందన్న ఆశాభావంతో ఉన్నారు.